Telangana BJP : బీజేపీ తొలి జాబితాలో హేమాహేమీల పేర్లు మిస్.. వారంతా పార్లమెంట్ కేనా?
ఎంపీలుగా ఉన్న బండి సంజయ్, అరవింద్, సోయం బాపూరావులకు బీజేపీ అధిష్టానం అసెంబ్లీ టికెట్లు కేటాయించింది.

BJP Party
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్టానం ఆదివారం విడుదల చేసింది. మొత్తం 52 మందికి తొలి జాబితాలో టికెట్ కేటాయించింది. బీజేపీ తొలి జాబితాలో ఎనిమిది మంది ఎస్సీలు, ఆరుగురు ఎస్టీలు , 12మంది మహిళలకు అవకాశం దక్కింది. అయితే, ఎంపీలుగా ఉన్న బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావులను బీజేపీ అధిష్టానం అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపింది. మరోవైపు ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేస్తుండగా. తాజాగా సస్పెన్షన్ నుంచి విముక్తి పొందిన రాజాసింగ్ పేరుకూడా తొలిజాబితాలో ఉంది. రాజాసింగ్ మరోసారి గోషామహల్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు.
బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో హేమాహేమీల పేర్లు లేకపోవటంతో ఆ పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తొలి జాబితాలో ఖచ్చితంగా వస్తాయనుకున్న నేతల పేర్లు రాకపోవటంతో ఏం జరుగుతుందోనన్న చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతుంది. ముఖ్యంగా తొలి జాబితాలో ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, డీకే అరుణ, బూర నర్సయ్య గౌడ్, విజయశాంతి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్లు వస్తాయని అందరూ భావించారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో మిగిలిన ముఖ్య నేతలు పేర్లను బీజేపీ అధిష్టానం రెండో జాబితాలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బీజేపీ ఎంపీలుగా ఉన్న బండి సంజయ్, అరవింద్, సోయం బాపూరావులకు బీజేపీ అధిష్టానం అసెంబ్లీ టికెట్లు కేటాయించింది. డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు ఇప్పటికే సిద్ధమయినట్లు తెలిసింది. అయినా మొదటి లిస్ట్ లో వారి పేర్లు లేకపోవటంతో.. రెండో జాబితాలో ప్రకటస్తారా? లేకుంటే పార్లమెంట్ ఎన్నికల సమయంలో అభ్యర్థులుగా బరిలోకి దింపేందుకు అధిష్టానం నిర్ణయించిందా అనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతుంది.