NIMS: తెలంగాణ ఆరోగ్యంపై నిమ్స్ నయా సంతకం.. దేశంలోనే అతిపెద్ద ఆస్పత్రిగా నిమ్స్ రికార్డు

తెలంగాణ సర్కార్ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఆరోగ్య తెలంగాణలో భాగంగా హైదరాబాద్ నిమ్స్ విస్తరణకు నడుం బిగించింది.

NIMS: తెలంగాణ ఆరోగ్యంపై నిమ్స్ నయా సంతకం.. దేశంలోనే అతిపెద్ద ఆస్పత్రిగా నిమ్స్ రికార్డు

telangana govt focused on public health care sector

NIMS – Telangana Public Health Care : దేవుడు ప్రాణం పోస్తాడు.. వైద్యుడు ప్రాణం నిలుపుతాడు. అందుకే వైద్య నారాయణుడు అంటుంటాం… వైద్యం చేసే వారిని దైవంగా భావిస్తాం.. మనిషి మనుగడకు ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఆస్తి, ఐశ్వర్యం వల్ల దక్కని ఆనందం.. సంపూర్ణ ఆరోగ్యంతోనే సాధ్యం. ఆరోగ్యం మహాభాగ్యం అన్నది కూడా ఇందుకే.. ప్రభుత్వాలు కూడా ఆరోగ్య రంగానికి విస్తృత ప్రాధాన్యం ఇస్తుంటాయి. ప్రజారోగ్యమే ప్రథమ కర్తవ్యంగా భావిస్తుంటాయి. ఆరోగ్యశ్రీ (Aarogyasri) వంటి పథకాలతో కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. అయినా కొన్ని జబ్బులు జనాలను హడలెత్తిస్తే.. కార్పొరేట్‌ ఆస్పత్రులు జేబులు గుల్ల చేస్తున్నాయి. ఈ కార్పొరేట్ దోపిడీకి అడ్డుకట్ట వేసేలా తెలంగాణ ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, బోధనాసుపత్రులకు పెద్దపీట వేసింది. తాజాగా నిమ్స్ విస్తరణకు శ్రీకారం చుట్టి.. దేశంలోనే 4 వేల పడకలు ఉన్న ఏకైక ప్రభుత్వ ఆస్పత్రిగా నిలిపింది కేసీఆర్ ప్రభుత్వం.

ఆరోగ్య తెలంగాణలో భాగంగా..
తెలంగాణ సర్కార్ (Telangana Govt) సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఆరోగ్య తెలంగాణలో భాగంగా హైదరాబాద్ నిమ్స్ విస్తరణకు నడుం బిగించింది. ప్రతి ఒక్కరికి కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో నిమ్స్ సామర్థ్యాన్ని 4 వేల పడకలకు పెంచింది కేసీఆర్ (KCR) సర్కార్. కార్పొరేట్ వైద్యం అంటేనే గుండె గుభేల్ మనే పరిస్థితుల్లో కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయం రోగుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఉన్నా.. కొన్ని రకాల వైద్య సేవలకు కార్పొరేట్ వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి. కొన్ని రకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీలో చోటు లేకపోవడం.. ఉన్నా ఖర్చు పరిమితి దాటిపోవడంతో పేద, మధ్య తరగతి వారికి మెరుగైన వైద్యం కలగా మారుతోంది. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని చిన్నచిన్న వ్యాధులు.. సాధారణ రోగాలకు కూడా వైద్య పరీక్షలు.. ట్రీట్‌మెంట్ పేరుతో బిల్లలు వేలల్లో బాధేస్తున్నారు. కార్పొరేట్ దోపిడీకి అడ్డుకట్ట లేకపోవడం.. ప్రభుత్వ ఆస్పత్రులపై జనాల్లో చులకన భావం ఉండటంతో చాలా మంది మెరుగైన వైద్యం కోసం అప్పుల పాలవుతున్నారు. మరికొందరు వైద్యం చేయించుకోలేక మంచానికి పరిమితమవుతున్నారు.

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు
కార్పొరేట్‌కు దీటుగా తెలంగాణలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, ఎన్నో ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నా.. అక్కడ ఏయే రోగాలకు వైద్యం లభిస్తుందో.. ఎలాంటి వసతులు ఉంటాయో తెలియడం లేదు. అవగాహన లేక ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తూ ఇల్లు, ఒళ్లు గుళ్ల చేసుకుంటున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిమ్స్ విస్తరణకు శ్రీకారం చుట్టారు. చౌక ధరలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్న హైదరాబాద్ నిమ్స్ దేశంలోనే ప్రముఖ వైద్య సంస్థల్లో అగ్రగామిగా నిలుస్తోంది. 15 వందల 74 కోట్లతో అదనంగా మరో రెండు బ్లాక్‌లను నిర్మించి కొత్తగా మరో రెండు వేల బెడ్‌లను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది కేసీఆర్ సర్కార్. అంతేకాదు ప్రస్తుతం అందిస్తున్న వైద్య సేవలకు అదనంగా మరో 34 రోగాలకు చికిత్సలు చేయనున్నారు.

సామాన్యులను దోచుకుంటున్న హెల్త్ మాఫియా
నిమ్స్ ఒక్కటే కాదు తెలంగాణలో ఎన్నో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చాయి. కానీ, సామాన్యులకు వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారింది. ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉన్నా.. మెరుగైన వసతులు.. సౌకర్యాలు ఉన్నా.. రోగులు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లేవిధంగా ప్రోత్సహిస్తోంది హెల్త్ మాఫియా. కార్పొరేట్ వైద్యులు, గ్రామీణ ప్రాంతంలో ఉండే ఆర్‌ఎంపీ, పీఎంపీలు ఓ మాఫియాగా ఏర్పడి సర్కార్ వైద్యంపై లేనిపోని అపోహలు సృష్టిస్తూ సామాన్యులను దోచుకుంటున్నారు. చిన్నచిన్న వైద్య పరీక్షలకు కూడా వందలు, వేల రూపాయల్లో బిల్లు వేస్తూ.. ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఆరోగ్యంపై భయంతో టెస్టులు చేయించుకోకపోతే ఏమై పోతుందోననే టెన్షన్‌తో చాలా మంది అవసరం ఉన్నా లేకపోయినా వేల రూపాయలు చెల్లిస్తూ చికిత్సలు చేయించుకుంటున్నారు. చేతిలో డబ్బు లేకపోయినా.. చౌకగా సర్కార్ వైద్యం అందుబాటులో ఉన్నా.. మాఫియా ప్రభావంతో కార్పొరేట్ తలుపు తడుతున్నారు. ఆరోగ్యం కోసం అప్పుల పాలవుతున్నారు.

నిమ్స్‌లో మెరుగైన వైద్యం
కార్పొరేట్ ప్రైవేటు ఆస్పత్రులతో పోల్చుకుంటే నిమ్స్‌లో అంతకు మించిన మెరుగైన వైద్యం అందుబాటులో ఉంది. కార్పొరేట్ ఆస్పత్రులకన్నా మిన్నగా వైద్య పరీక్షలు చేసే సౌకర్యాలు ఉన్నాయి. సీటీ స్కాన్‌కు నిమ్స్‌లో 14 వందలు వసూలు చేస్తే.. కార్పొరేట్ ఆస్పత్రులు, ప్రైవేటు పరీక్ష క్షేంద్రాల్లో ఏడు నుంచి 8 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. మెదడుకు సంబంధించిన ఎంఆర్‌ఐ స్కాన్‌కు నిమ్స్‌లో ఏడు నుంచి 9 వేల రూపాయలు ఖర్చు అవుతుండగా, ప్రైవేటులో 20 నుంచి 22 వేలు వసూలు చేస్తున్నారు. ఈ పరీక్షలకు వాడే మెటీరియల్, మిషనరీ అంతా ఒకటే.. కానీ, ప్రైవేటు పరీక్ష కేంద్రాలు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో రెండింతల డబ్బు వసూలు చేస్తున్నారు. ఈ దోపిడీపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండటం లేదు. అధికారుల నియంత్రణ ఉండటం లేదు. ఎంతసేపు వైద్యం అందిస్తున్నామనే ప్రభుత్వం ఆలోచిస్తుందికాని.. ఎంతమంది వినియోగించుకుంటున్నారనేది ఎప్పుడూ దృష్టిపెట్టినట్లు కనిపించడం లేదు. ప్రభుత్వం తమను పట్టించుకోదనే ధీమాతో కార్పొరేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నాయి.

IT Tower Siddipet: సిద్దిపేట ఐటీ టవర్ అదిరింది.. ఫొటోలు చూశారా!

మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న దళారీ వ్యవస్థ
ప్రభుత్వం అన్నిరకాల సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చినా.. సాధారణ డెలివరీలకు కూడా ప్రైవేటు ఆస్పత్రులకే వెళ్తున్నారు సామాన్యులు. గర్భిణులు పౌష్టికాహారం, రక్తహీనత వంటి రుగ్మతలతో బాధపడకుండా.. మెరుగైన ఆరోగ్యంతో ఉండాలనే సదుద్దేశంతో కేసీఆర్ కిట్లు పంపిణీ చేస్తుంది బీఆర్‌ఎస్ ప్రభుత్వం. ప్రసావానంతరం తల్లిపిల్లలు ఆరోగ్యం కోసం ఆర్థిక సాయం కూడా చేస్తుంది. కానీ, చాలా మంది డెలివరీలకు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అక్కడ డబ్బులపై మమకారంతో వైద్యులు అవసరం లేకపోయినా.. సిజేరియన్లు చేస్తున్నారు. మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాన్నే దెబ్బతీసేవిధంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇష్టానుసారం డెలివరీలు చేస్తున్నా.. పర్యవేక్షణ ఉండటం లేదు. కేసీఆర్ కిట్లు అందుకుంటున్న గర్భిణులు డెలివరీ సమయంలో ప్రైవేటు బాట పట్టడానికి కారణం ఆరా తీస్తే.. దళారీ వ్యవస్థ ప్రమేయమే కనిపిస్తోంది. ఆర్‌ఎంపీ, పీఎంపీ ప్రాక్టీషనర్లే కాదు.. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు కూడా… ప్రైవేటు ఆస్పత్రులు ఇచ్చే కమీషన్‌పై కక్కుర్తితో గర్భిణులను ప్రైవేటు ఆస్పత్రులకు.. ఆపరేషన్ థియేటర్లకు తీసుకువెళ్తున్నారు.

Also Read: తెలంగాణలోని 5 నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు.. ఇవి ఎందుకు ఇస్తారో తెలుసా?

ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కంటున్న ఆరోగ్య తెలంగాణ సాధించాలంటే… ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులపై పర్యవేక్షణ కూడా అతిముఖ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే సమయంలో ప్రైవేటు, కార్పొరేట్ దోపిడీని అరికడితే.. పేదలకు అంతకుమించిన చేసిన సాయం మరొకటి ఉండదు. సంక్షేమ పథకాలతో నిలువెత్తు ధనం ఇచ్చినా సంతృప్తి పరచవచ్చో లేదో కాని.. ఆపద అంటూ ఆస్పత్రికి వచ్చిన వారు చిరునవ్వుతో ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం పరిపూర్ణమవుతుంది.

హైదరాబాద్ చుట్టూ నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు.. వివరాలకు ఈ వీడియో చూడండి