డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అమ్మినా, అద్దెకిచ్చినా కేసులు

deeds of double bedroom houses Distribution in Siddipet : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మినా, అద్దెకిచ్చినా కేసులు నమోదు చేస్తామని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. లబ్ధిదారుల ఎంపికలో అవినీతిపరులను పట్టిస్తే రూ.10 వేల రివార్డ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. సిద్దిపేటలోని కేసీఆర్ నగర్ లో ఏడో విడతలో భాగంగా 216 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిగిలిన అర్హులందరికీ త్వరలో ఇళ్ల కట్టిస్తామని చెప్పారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎంపిక అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగిందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని గెటేడ్ కమ్యూనిటీ తరహాలో సకల సౌకర్యాలతో ఇండ్లు నిర్మించి ఇచ్చామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయొద్దని తెలిపారు.
దోమల బెడద, ఈగలు లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించామని పేర్కొన్నారు. ఈ ఇళ్ల నిర్మాణానికి రెండున్నర సంవత్సరాలు కష్టపడ్డామని తెలిపారు. నిర్మాణం జరుగుతున్న సమయంలో సుమారు 400 సార్లు ఈ ప్రాంతానికి వచ్చానని పేర్కొన్నారు.