Hyderabad T20 Match : 2500 మంది పోలీసులు, 300 సీసీ కెమెరాలు.. భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు టైట్ సెక్యూరిటీ-సీపీ మహేశ్ భగవత్

Hyderabad T20 Match : 2500 మంది పోలీసులు, 300 సీసీ కెమెరాలు.. భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు టైట్ సెక్యూరిటీ-సీపీ మహేశ్ భగవత్

Hyderabad T20 Match : ఈ నెల 25న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్. మ్యాచ్ చూసేందుకు దాదాపు 40వేల మందికిపైగా వస్తారన్నారు. ఎవరైనా బ్లాక్ లో టిక్కెట్లు అమ్మితే కఠిన చర్యలు తప్పవన్నారు. మ్యాచ్ జరిగే రోజు అర్థరాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లతో పాటు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు సీపీ భగవత్. సీసీ కెమెరాల ద్వారా భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తామన్నారు. మ్యాచ్ జరిగే రోజున సాయంత్రం 4 గంటల నుండి ప్రేక్షకులను స్టేడియంలోనికి అనుమతిస్తామన్నారు సీపీ మహేశ్ భగవత్.

”ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేపట్టాం. ఎలాంటి అనివార్య సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం 40వేల మంది క్రీడాభిమానులు మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియంకి వస్తారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా ఏర్పాట్లు చేపట్టాం. మొత్తం 2వేల 500 మంది సిబ్బందిని నియమించాం. 300 సీసీ కెమెరాలతో నిఘా పెట్టాం.

ఉప్పల్ స్టేడియం బయట ఉన్న అప్రోచ్ రోడ్లను మా ఆధీనంలోకి తీసుకున్నాం. మ్యాచ్ ముగిసిన తర్వాత ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా.. మెట్రోను రాత్రి ఒంటిగంట వరకు తిప్పాలని విజ్ఞప్తి చేశాం. ఆర్టీసీకి కూడా అదనపు బస్సుల కోసం లేఖ రాశాం. స్టేడియం వద్ద ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి. 21 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశాం. ఒక్కొక్క పార్కింగ్‌లో 1400 ఫోర్ వీలర్స్ పట్టేలా ప్రత్యేక పార్కింగ్స్ ఏర్పాటు చేశాం. స్టేడియం చుట్టూ మూడు జంక్షన్లు ఉన్నాయి.

ఎల్లుండి సాయంత్రం నాలుగు గంటల నుండి స్టేడియం వైపు భారీ వాహనాలకు అనుమతి లేదు. మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేశాం. ఏక్ మీనార్ వద్ద ఎలాంటి పార్కింగ్‌కి అనుమతి లేదు. సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఒంటి గంట దాకా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఐదు మొబైల్ పార్కింగ్‌లతో పాటు ఎమర్జెన్సీ వాహనాల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశాం” అని సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు.