ఎంఐఎం మద్దతుతో గ్రేటర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న టీఆర్ఎస్

ఎంఐఎం మద్దతుతో గ్రేటర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న టీఆర్ఎస్

GHMC mayor Gadwala Vijayalakshmi : ఎట్టకేలకు జీహెచ్ఎంసీ కొత్త పాలకమండలి కొలువుదీరింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం టీఆర్ఎస్ కు దక్కింది. ఎంఐఎం మద్దతుతో మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. జీహెచ్ఎంసీ మేయర్ గా టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ గా టీఆర్ఎస్ అభ్యర్థి మోతే శ్రీలతారెడ్డి ఎన్నికయ్యారు. ఎంఐఎం కార్పొరేటర్లు టీఆర్ఎస్ కు మద్దుతు తెలిపారు. కాగా మేయర్ పదవికి రెండు పేర్లు ప్రతిపాదించారు. మేయర్ అభ్యర్థిగా టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మీ పేరును కార్పొరేటర్ ఫసియుద్దీన్ ప్రతిపాదించారు. గాజులరామారం కార్పొరేటర్ సమర్థించారు. బీజేపీ మేయర్ అభ్యర్థిగా రాధ ధీరజ్ రెడ్డిని ఆ పార్టీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించారు.

అంతకముందు ఉదయం 11 గంటలకు నూతన కార్పొరేటర్లు అందరూ జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్ లో ఒకేసారి ప్రమాణం చేశారు. తెలుగు, హిందీ, ఊర్దూ, ఇంగ్లీష్ బాషల్లో కార్పొరేటర్లు ప్రమాణం చేశారు. 149 మంది కార్పొరేటర్లతో ఎన్నికల అధికారి శ్వేతా మహంతి ప్రమాణస్వీకారం చేయించారు. ఇక మేయర్ స్థానం కోసం బరిలో టీఆర్ఎస్‌తో పాటు బీజేపీ కూడా నిలిచింది. టీఆర్ఎస్ నుంచి గద్వాల విజయలక్ష్మిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించగా.. మోతే శ్రీలతారెడ్డిని డిప్యూటీ మేయర్‌గా ప్రకటించారు.

బీజేపీ నుంచి ఆర్కేపురం కార్పొరేటర్ రాధ ధీరజ్‌రెడ్డిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. బషీర్‌బాగ్‌లో అమ్మవారిని దర్శించుకున్న కమలం కార్పొరేటర్లు.. జీహెచ్ఎంసీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. అటు ఎంఐఎం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మేయర్, డిప్యూటీ మేయర్‌ పోటీలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. టీఆర్ఎస్ కు మద్దుతు పలికారు.

గతేడాది డిసెంబర్ లో జీహెచ్ఎంసీకి ఎన్నికలు జరుగగా… 4వ తేదీన ఫలితాలు వచ్చాయి. నిన్నటితోనే జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు ముగిసింది. దీంతో షెడ్యూల్ ప్రకారం ఇవాళ నూతన పాలకమండలి ఎన్నిక నిర్వహించారు. మేయర్ ఎన్నిక కార్యక్రమాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిక్స్ చేసింది. సభ్యుల హాజరును బట్టి ఉదయం 11గంటల నుంచి ప్రిసైడింగ్ ఆఫీసర్ శ్వేతమహంతి ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు, హిందీ నాలుగు భాషల్లో కార్పొరేట్లర్లు ప్రమాణం స్వీకారం చేశారు.