Bayyaram Steel Plant : దమ్ముంటే.. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి- సీఎం కేసీఆర్‌కు కిషన్ రెడ్డి సవాల్

బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎ కేసీఆర్ ను ఆయన టార్గెట్ చేశారు.

Bayyaram Steel Plant : దమ్ముంటే.. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి- సీఎం కేసీఆర్‌కు కిషన్ రెడ్డి సవాల్

Bayyaram Steel Plant : బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎ కేసీఆర్ ను ఆయన టార్గెట్ చేశారు.

బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పేరుతో ఓట్ల కోసం టీఆర్ఎస్ వీధి నాటకాలు ఆడుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీపై విభజన చట్టంలో ఫీజుబిలిటీ స్టడీ చేయాలని మాత్రమే ఉందన్నారు. అక్కడ నాణ్యమైన ముడి ఖనిజం లేదని నిపుణులు తేల్చారని కిషన్ రెడ్డి తెలిపారు. ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని కమిటీ తేల్చి చెప్పిందని కిషన్ రెడ్డి చెప్పారు. ఈ అంశాలను కేంద్రమంత్రి రాజ్యసభలోనే ప్రకటించారని ఆయన వెల్లడించారు.

”విభజన చట్టంలో బయ్యారం స్టీల్ ప్లాంట్‌పై స్టడీ చేయాలని ఉందని, దీని ప్రకారమే కేంద్రం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బయ్యారం వెళ్లి అధ్యయనం చేసింది. బయ్యారం స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని కమిటీ తేల్చి చెప్పింది. మోదీ సర్కార్ ఏర్పడ్డ ఆర్నెల్లలోపే ఈ ప్రక్రియ పూర్తైంది. ఫీజిబిలిటీ అంశంపై ప్రపంచ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని కమిటీ నివేదిక ఇచ్చింది. బయ్యారంలో ముడి ఖనిజంలో నాణ్యత లేదని కమిటీ చెప్పింది. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా స్టీల్ తయారు చేయలేమంది. స్టీల్‌ ప్లాంట్ ఏర్పాటు చేస్తే మరో ఖాయిల పరిశ్రమగా మారుతుంది” అని కిషన్‌రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ సర్కార్.. ప్రజా సమస్యలను, పాలనను గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. బీజేపీని, కేంద్రాన్ని, ప్రధాని మోదీని విమర్శించడమే ఏకైక అజెండాగా టీఆర్ఎస్ పెద్దలు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను కలవకుండా తొమ్మిదేళ్లుగా సగం రోజులు ప్రగతి భవన్‌లో, సగం రోజులు ఫామ్ హౌస్‌లో కేసీఆర్ కాలం గడిపారని కిషన్ రెడ్డి విమర్శించారు.

కేంద్రం కట్టకపోతే తామే బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కడతామని 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ అన్న మాటలు ఏమయ్యాయని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పది నుంచి 15వేల మందికి తాము ఉద్యోగాలు కల్పిస్తామని కేసీఆర్ చెప్పారని కేంద్రమంత్రి గుర్తుచేశారు. చేతనైతే, దమ్ముంటే.. ఇచ్చిన మాట ప్రకారం.. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ మీరు పెట్టాలి అని కేసీఆర్ కు సవాల్ విసిరారు కిషన్ రెడ్డి. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ మాట ఇవ్వలేదని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.

తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా అమలు కావాలని.. జాతీయ పార్టీ పెడతానంటూ కేసీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని కిషన్ రెడ్డి చురకలంటించారు. తెలంగాణలో ఏమీ సమస్యలు లేవని.. ఎనిమిదేళ్ల పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సెక్రటేరియట్‌కు సీఎం రాకుండా పరిపాలన చేయడం, ఉన్న సెక్రటేరియట్‌ను కూలగొట్టడం, మంత్రికి కేబినెట్‌లో స్థానం లేకుండా నడపడం. ఇదేనా తెలంగాణ మోడల్? అంటే అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఏం చూసి దేశప్రజలు మీకు స్వాగతం పలుకుతారని ఆయన నిలదీశారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ మాట తప్పలేదన్న కిషన్ రెడ్డి.. మాట తప్పింది కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు అని ఎదురు దాడికి దిగారు.