YS Vijayamma : రాజన్న రాజ్యం తెలంగాణ జన్మహక్కు – విజయమ్మ

YS Vijayamma : రాజన్న రాజ్యం తెలంగాణ జన్మహక్కు – విజయమ్మ

Ys Vijayamma (2)

YS Vijayamma : హైదరాబాద్ లో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల రాజకీయ పార్టీ ఆవిర్భావ కార్యక్రమం హాట్టహాసంగా సాగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తల నడుమ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఆవిష్కరించారు. అంతకు ముందు రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ పార్టీని ఉద్దేశించి మాట్లాడారు. షర్మిలను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.

వైఎస్ఆర్ అంటే తెలుగువారి గుండెచప్పుడని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజలు వైఎస్ఆర్ ని ఆదరించారని గుర్తుచేశారు. రాజశేఖర్ రెడ్డికి వివక్ష అనేది తెలియదని అందరిని సమానంగా చూసేవారని అన్నారు. తన ప్రతి అడుగు జనజీవితంతో ముడిపడి ఉందని రాజశేఖర్ రెడ్డి చెప్పేవారని విజయమ్మ వ్యాఖ్యానించారు.

రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అంతకు తగ్గకుండా ప్రజలకు ఇచ్చారని అన్నారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో సంక్షేమం అభివృద్ధికి పెద్దపీఠ వేశారని వివరించారు. వైఎస్ లేరని తెలిసి పరితపించిన గుండెలు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయని విజయమ్మ తెలిపారు. వైఎస్ కోసం చనిపోయిన వారు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నారని విజయం వివరించారు.

అనంతరం షర్మిల గురించి మాట్లాడుతూ తాను 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసిందని తెలిపారు. ఆడబిడ్డ రాజకీయాల్లోకి వచ్చిందని చులకనగా చూడనక్కరలేదని సింహం లాంటి నేతకు జండర్ అడ్డురాదని విజయమ్మ అన్నారు. షర్మిలను వైఎస్ఆర్ ప్రిన్సెస్ పెంచారని తండ్రి ఆశయ సాధనకోసమే షర్మిల ఈ రోజు పార్టీ ప్రారంభిస్తున్నారని ఆమె వివరించారు. రాజన్న రాజ్యం తెలంగాణ జన్మహక్కని షర్మిల నమ్ముతుందని అందుకే ఇక్కడ కొత్త పార్టీ పెట్టిందని ఆమె వివరించారు.