Warangal Lok Sabha Constituency : రసవత్తరంగా వరంగల్ పార్లమెంట్ రాజకీయం.. రానున్న ఎన్నికల్లో గడ్డు పరిస్థితులెవరికి ? గట్టెక్కేదెవరు ?

ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో వరంగల్ వెస్ట్ అసెంబ్లీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. దాస్యం వినయ్‌ భాస్కర్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. వ్యూహాత్మకమైన రాజకీయాల్లో దిట్టగా పేరున్న వినయ్ భాస్కర్... పార్టీలోను, నియోజకవర్గంలోనూ ఎదురులేకుండా చేసుకోవడంలో విజయం సాధించారు. వినయ్ భాస్కర్‌కు టికెట్ విషయంలో ఎలాంటి సందేహం లేదు.

Warangal Lok Sabha Constituency : రసవత్తరంగా వరంగల్ పార్లమెంట్ రాజకీయం.. రానున్న ఎన్నికల్లో గడ్డు పరిస్థితులెవరికి ? గట్టెక్కేదెవరు ?

WARANGAL

Warangal Lok Sabha Constituency : తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన జిల్లా.. రాష్ట్ర సాధనకు కీలక మంత్రాంగం నడిపిన ఖిల్లా. ఉత్తర తెలంగాణ కేంద్రమైన ఓరుగల్లు.. తెలంగాణ రాష్ట్రానికి ఓ పోరు సైరన్. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరమే! దేశానికి ప్రధానిని అందించిన ఘనత.. అలాంటి అపర చాణక్యుడిని పరాజయం పాలుచేసిన చరిత్ర.. రెండూ ఓరుగల్లు సొంతమే ! ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. మధ్యలో పసుపు జెండా రెపరెపలాడినా.. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి వరంగల్ పార్లమెంట్ గులాబీ సేనకు పెట్టని కోటగా మారింది.. తెలంగాణలో రాజకీయం సెగలు కక్కుతున్న వేళ.. వరంగల్ పార్లమెంట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. మరి ఇక్కడ పొలిటికల్ పిక్చర్ ఏం చెప్తోంది. ఏ పార్టీ సీన్ ఏంటి.. సవాళ్లు ఏంటి ? గడ్డు పరిస్థితులెవరికి ? గట్టెక్కేదెవరు ? హస్తవాసి మారుతుందా.. నాటి జాయింట్ కిల్లర్ ఫార్ములా కమలదళంతో కవాతు చేయిస్తుందా.. ఓటర్లు కోరుకుంటున్న నేతలెవరు? రాజకీయాల్లో పరుగులుపెడుతున్న రేసుగుర్రాలెవరు..

Pasunoori Dayakar

Pasunoori Dayakar

వరంగల్ సిట్టింగ్ ఎంపీగా పసునూరి దయాకర్.. ఈసారి ఆయనకు టికెట్‌ డౌటేనా?

తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అంత ప్రాధాన్యత కలిగిన జిల్లా ఉమ్మడి వరంగల్. ఉద్యమాల ఖిల్లాగా ఉన్న వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయ పార్టీలకు కీలకమైన స్థానం. 1977లో వరంగల్‌ పార్లమెంట్ స్థానం ఏర్పాటుకాగా.. ఆరుసార్లు కాంగ్రెస్, రెండుసార్లు టీడీపీ విజయం సాధించగా.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత గులాబీసేనకు వరంగల్‌ పెట్టనికోటగా మారింది. పసునూరి దయాకర్‌ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అనూహ్యంగా అవకాశం దక్కించుకొని 2015లో విజయం సాధించిన దయాకర్‌.. 2019లోనూ గెలుపొందారు. రాజకీయం ఇప్పుడు ఇక్కడ పూర్తిగా మారిపోయింది. రోజుకో రకంగా అన్నట్లు పొలిటికల్ పరిణామాలు కనిపిస్తున్నాయ్. ప్రస్తుత పరిణామాలు సిట్టింగ్ ఎంపీ పసునూరి దయార్‌కు అనుకూలంగా కనిపించడం లేదు. అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. సిట్టింగ్‌ ఎంపీకి ప్రత్యామ్నాయంగా మరో నలుగురిని తెరమీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది గులాబీ పార్టీ అధిష్టానం.

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో కడియం వర్సెస్‌ తాటికొండ రాజయ్యల మధ్య వర్గపోరు…

స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో రాజయ్య వర్సెస్ కడియం వర్గపోరు… వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ అధిష్టానానికి బలమైన వ్యక్తిగా కనిపించడం.. పసునూరి ఎంపీగా మార్క్ చూపించలేకపోయారని పసునూరి మీద జనాలు అభిప్రాయానికి రావడం.. సిట్టింగ్‌ ఎంపీకి ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయ్. దీంతో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌తో పాటు చివరి ఆప్షన్‌గా కడియం శ్రీహరి కూతురు కావ్య పేర్లను కూడా వరంగల్‌ ఎంపీ విషయంలో గులాబీ పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సర్వేలు కూడా చేయించినట్లు టాక్. ఎవరిని బరిలో దింపితే విజయం ఏకపక్షం అవుతుందన్న ఆలోచనలు చేస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో రాజయ్య వర్సెస్ కడియం వర్గపోరు క్లారిటీపైనే.. సిట్టింగ్ ఎంపీ టికెట్, రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. ఐతే వివాదరహితుడైన తనకు.. అధిష్టానం మళ్లీ అవకాశం కల్పిస్తుందని పనుసూరి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

READ ALSO : Kammam Politics : ఖమ్మం చుట్టూ తిరుగుతున్న తెలంగాణా రాజకీయం… గులాబీ పార్టీలో గ్రూపుల గుబులు

babumohan,sambaiah,rajayya

babumohan,sambaiah,rajayya

రాజయ్యతో పాటు కాంగ్రెస్ టికెట్‌ రేసులో దొమ్మాటి సాంబయ్య.. బాబూమోహన్‌ను వరంగల్‌ ఎంపీ బరిలో దింపాలని ప్లాన్ లో ఉన్న బిజెపి

బీఆర్ఎస్‌తో పాటు.. కాంగ్రెస్‌, బీజేపీలోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. 2009లో కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించిన సిరిసిల్ల రాజయ్య మరోసారి టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ సన్నిహితుడు దొమ్మాటి సాంబయ్య కూడా ఇక్కడ బరిలో నిలవాలని అనుకుంటున్నారు. రేవంత్‌ కోటరీకి చెందిన వ్యక్తి కావడంతో.. టికెట్ మీద ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కూడా.. వరంగల్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. బీజేపీలోనూ పోటీ భారీగానే కనిపిస్తోంది. 2019లో బీజేపీ తరఫున చింతా సాంబమూర్తి పోటీ చేయగా.. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. బీజేపీ టికెట్ రేసులో మాజీ మంత్రి విజయరామారావును బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతుండగా.. ఆయన స్టేషన్ ఘన్‌పూర్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చే చాన్స్ ఉంది. సినీనటుడు, మాజీ మంత్రి బాబూమోహన్‌ను వరంగల్‌ ఎంపీ బరిలో దింపాలని బీజేపీ మెజారిటీ వర్గం భావిస్తోంది. ఆయనతో పాటు మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్‌ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే.. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, భూపాలపల్లి, పాలకుర్తి ఐదు స్థానాలు జనరల్‌ కాగా.. స్టేషన్ ఘన్‌పూర్‌, వర్ధన్నపేట ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలు.

narender

narender

వరంగల్‌ తూర్పు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా నన్నపనేని నరేందర్.. ఈ స్థానంపై గులాబీ పార్టీ అధిష్టానం గురి

వరంగల్ ఈస్ట్‌.. పొలిటికల్ సర్కిల్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. నన్నపనేని నరేందర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్‌లో అత్యధిక వర్గ విభేదాలు ఉన్న నియోజకవర్గం ఇదే ! స్థానిక ఎమ్మెల్యేతోతో స్థానిక సీనియర్‌ నేతలు బస్వరాజు సారయ్య, గుండు సుధారాణి, మెట్టు శ్రీనివాస్‌కు ఏ మాత్రం పొసగడం లేదు. నరేందర్‌కు పోటీగా వీళ్ల కూడా టికెట్ ఆశిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్‌ దక్కితే.. ఈ నలుగురు అతనికోసం పనిచేసే అవకాశాలు కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. దీంతో ఈ స్థానంపై గులాబీ పార్టీ అధిష్టానం గురిపెట్టింది.. నరేందర్‌తో పాటు టికెట్ కోరుతున్న నలుగురు నేతలపై సర్వేలు చేయిస్తోంది. దానికి అనుగుణంగానే టికెట్‌ కేటాయింపులు ఉండే చాన్స్ ఉంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యేతో సహా అందరికీ వివరించినట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో పాటు గంటా రవికుమార్‌, కుసుమ సతీష్‌ టికెట్‌ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. బీజేపీకి ఆదరణ పెరుగుతున్న నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. ప్రదీప్‌రావుకు మంచి అనుచరవర్గం ఉండడం.. ఇక్కడ బీజేపీకి కలిసివచ్చే చాన్స్ ఉంది. కాంగ్రెస్ నుంచి కొండా సురేఖతో పాటు.. ఎర్రబెల్లి స్వర్ణ పేర్లు వినిపిస్తున్నాయ్. కొండా సురేఖ సీటు మార్పు కోరితే.. స్వర్ణకు రూట్ క్లియర్‌ కావడం ఖాయం. నియోజకవర్గ కార్యక్రమాలకు స్వర్ణ దూరంగా ఉంటున్నారు. దీంతో కాంగ్రెస్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

READ ALSO : Bhuvanagiri Lok Sabha Constituency : భువనగిరిపై బిజెపి కన్ను… పట్టు సాధించేందుకు కాంగ్రెస్ స్ట్రాటజీలు… వ్యూహాల్లో నిమగ్నమైన గులాబీ పార్టీ

vinay bhaskar

vinay bhaskar

వరంగల్ పశ్చిమం సిట్టింగ్ ఎమ్మెల్యేగా దాస్యం వినయ్ భాస్కర్‌..కాంగ్రెస్ నుంచి నాయిని రాజేందర్ రెడ్డితో పాటు.. జనగామ డిసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి పేర్లు

ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో వరంగల్ వెస్ట్ అసెంబ్లీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. దాస్యం వినయ్‌ భాస్కర్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. వ్యూహాత్మకమైన రాజకీయాల్లో దిట్టగా పేరున్న వినయ్ భాస్కర్… పార్టీలోను, నియోజకవర్గంలోనూ ఎదురులేకుండా చేసుకోవడంలో విజయం సాధించారు. వినయ్ భాస్కర్‌కు టికెట్ విషయంలో ఎలాంటి సందేహం లేదు. టీఆర్ఎస్‌ ఈజీగా గెలిచే స్థానాల్లో ఇది కూడా ఒకటి. అర్బన్ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో.. వారిని అట్రాక్ట్ చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నాయ్. కాంగ్రెస్ నుంచి నాయిని రాజేందర్ రెడ్డితో పాటు.. జనగామ డిసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. దీంతో రెండువర్గాల మధ్య పోరు పీక్స్‌కు చేరింది. ఇద్దరి మధ్య విభేదాలను అనుకూలంగా మార్చుకొని టికెట్ సాధించాలని పీసీసీ నేత వేం నరేందర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. బీజేపీ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ టికెట్ ఆశిస్తుండగా.. ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో బరిలో నిలవాలని మాజీ ఎమ్మెల్యే ధర్మారావు ప్లాన్‌ చేస్తున్నారు. యువనేత ఇనుగుల రాకేష్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తుండగా.. గతంలో రేవూరి ప్రకాశ్ రెడ్డిని బరిలో దించాలని బీజేపీ కోర్‌ కమిటీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అర్బన్ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో.. బీజేపీలో టికెట్‌ పోటీ ఎక్కువగా కనిపిస్తోంది.

Dharma Reddy, Konda Surekha

Dharma Reddy, Konda Surekha

పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యేగా చల్లా ధర్మారెడ్డి..మళ్లీ వరంగల్ తూర్పు మంత్రం జపిస్తున్న కొండా సురేఖ

పరకాలలో చల్లా ధర్మారెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనటే టికెట్ దాదాపు కన్ఫార్మ్ అయినట్లు కనిపిస్తున్నా.. రాష్ట్ర రుణ విమోచన చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. రెండుసార్లు ఈజీగా విజయం సాధించిన ధర్మారెడ్డికి ఈసారి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఐతే కాంగ్రెస్‌లో కన్ఫ్యూజన్‌, బీజేపీ ఇంకా బలపడక పోవడం ఆయనకు కలిసివచ్చే అంశాలు. కొండా సురేఖ మళ్లీ వరంగల్ తూర్పు మంత్రం జపిస్తుండటంతో… కాంగ్రెస్‌లో కన్ఫ్యూజన్‌ ఏర్పడింది. మరో నేత వెంకట్రామ్‌ రెడ్డి దేశాయ్ కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. కొండా దంపతులను పక్కనపెట్టి కార్యక్రమాలు కొనసాగిస్తున్నా.. పార్టీలో పట్టు దొరకడం లేదు. ఇక బీజేపీ నుంచి డాక్టర్ విజయ్ చందర్ రెడ్డితోపాటు.. డాక్టర్ కాళీ ప్రసాదరావు పేర్లు వినిపిస్తున్నాయ్. కాళీ పేరును ఈటల తెరపైకి తీసుకురాగా.. ఆయనను పార్టీలో చేర్చుకొని పోటీ చేయించడం ఖాయంగా కనిపిస్తోంది. బీసీ కార్డు ప్రయోగించి.. విజయాన్ని తమవైపు తిప్పుకోవాలన్నది బీజేపీ ప్లన్‌.

READ ALSO : Mahbubabad Lok Sabha Constituency : మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మలుపులు తిరుగుతున్న రాజకీయాలు….గులాబీ పార్టీ మళ్లీ పట్టు నిలుపుకుంటుందా ?

errabelli

errabelli

పాలకుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు..కాంగ్రెస్ అభ్యర్ధిగా తన కోటరీలోని కీలక వ్యక్తులను రంగంలోకి దించాలని రేవంత్ ప్లాన్‌

పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీలోనూ, నియోజకవర్గంలోనూ ఎర్రబెల్లికి ఎలాంటి వ్యతిరేకత లేదు. కారు పార్టీ కచ్చితంగా గెలిచే నియోజకవర్గాల్లో పాలకుర్తి ఒకటి ! కాంగ్రెస్‌, బీజేపీ నుంచి ఎవరు పోటీలో ఉంటారన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. హస్తం పార్టీ నుంచి గతంలో పోటీ చేసిన జంగా రాఘవరెడ్డి.. పాలకుర్తి వైపు కూడా చూడడం లేదు. కొండా మురళి బరిలో ఉంటారనేది ప్రచారంగానే మిగిలింది. మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు రఘురాంరెడ్డి పేరు కొత్తగా తెరమీదకు వస్తోంది. ఐతే పాలకుర్తిని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్.. తన కోటరీలోని కీలక వ్యక్తులను రంగంలోకి దించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంగబలం, అర్థబలం ఉన్న ఎన్ఆర్ఐ ఎర్రం రెడ్డి తిరుపతిరెడ్డిని బరిలోకి దింపి ఎర్రబెల్లికి సవాల్ విసరాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తన ప్రధాన అనురుడు పటేల్ రమేష్ రెడ్డితో పాటు.. వెన్నం శ్రీకాంత్ రెడ్డి పేర్లు కూడా పరిశీలిస్తున్నారు రేవంత్. బీజేపీ నుంచి బీసీ సామాజికవర్గానికి చెందిన పెద్దగాని సోమయ్య.. ట్రాన్స్‌పోర్ట్‌ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సామా వెంకట్ రెడ్డి పేర్లు తెరపైకి వస్తున్నాయ్.

Kadiyam, Rajaiah

Kadiyam, Rajaiah

స్టేషన్‌ ఘన్‌పూర్‌ సిట్టింగ్ ఎమ్మెల్యేగా తాటికొండ రాజయ్య… బీఆర్ఎస్ వర్గపోరును అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ ప్లాన్

వివాదాలకు కేరాఫ్‌గా మారింది స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం. తాటికొండ రాజయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తాటికొండ, కడియం వర్గాల మధ్య పోరు.. బీఆర్ఎస్‌ను టెన్షన్ పెడుతోంది. టికెట్ విషయంలో ఈ ఇద్దరు నేతలు ఎవరికి వారు ధీమాగా ఉన్నారు.. జనాల్లోకి దూసుకుపోతున్నారు. దీంతో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ వర్గపోరును తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. 2018లో ఇక్కడి నుంచి సింగపురం ఇందిర పోటీ చేయగా.. ఎన్నికల తర్వాత ఆమె ఇటు వైపు కూడా చూడలేదు. ఓయూ విద్యార్థి నేత మానవతా రాయ్‌తో పాటు.. పీసీసీ చీఫ్ రేవంత్ వర్గానికి చెందిన దొమ్మాటి సాంబయ్య పేర్లు కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్నా.. దానికి సంబంధించి క్షేతస్థాయిలో ఎలాంటి కదలిక కనిపించడం లేదు. బీజేపీ నుంచి మాజీ మంత్రి గుండె విజయరామారావు, మాదాసు వెంకటేశ్ పేర్లు తెరపైకి వస్తున్నాయ్. ఈ ఇద్దరు క్షేత్రస్థాయిలో యాక్టివ్‌గా లేరు. దీంతో పాటు కమలం పార్టీకి ఇక్కడ చెప్పుకోదగ్గ బలం కూడా లేదు. బీఆర్ఎస్ బలంగా ఉన్నా.. వర్గపోరు కారు పార్టీకి ఇబ్బందిగా మారే చాన్స్ ఉంది.

READ ALSO : Adilabad Lok Sabha Constituency : రాజకీయాలకు అడ్డాగా కుమ్రం భీమ్ పోరుగడ్డ… అదిలాబాద్ పై కన్నేసిన కమలం

ramesh

ramesh

వర్ధన్నపేట నుండి ఆరూరి రమేష్‌కు బీఆర్ఎస్‌ టికెట్ కన్ఫార్మ్.. బీజేపీ నుంచి కొండేటి శ్రీధర్‌కు దాదాపు రూట్ క్లియర్

వర్ధన్నపేటలో ఆరూరి రమేష్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఆరూరి రమేష్‌కు బీఆర్ఎస్‌ టికెట్ కన్ఫార్మ్‌. ఐతే వరంగల్ ఎంపీ రేసులో ఆరూరి పేరు వినిపిస్తోంది. ఐతే ఆయనకు ఎంపీ టికెట్‌ ఇస్తే.. భార్య కవితకు గానీ, కుమారుడు విశాల్‌కు కానీ ఆరూరి అసెంబ్లీ టికెట్ అడిగే అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ వీక్‌గా ఉంది. మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ బీజేపీ గూటికి చేరడంతో.. హస్తం పార్టీ కోలుకోలేని స్థితిలో ఉంది. ఐతే మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, పీసీసీ నేత నమిండ్ల శ్రీనివాస్.. ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. బీజేపీ నుంచి కొండేటి శ్రీధర్‌కు దాదాపు రూట్ క్లియర్‌. అర్బన్ ఓటర్లు నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయ్. దీంతో ఈ స్థానంపై కమలం పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది.

venkataramana reddy, jyothi

venkataramana reddy, jyothi

భూపాలపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా గండ్ర వెంకటరమణారెడ్డి… గండ్రకు బదులు ఆయన సతీమణి పోటీ చేస్తారనే ప్రచారం

భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్‌ను వర్గపోరు టెన్షన్ పెడుతోంది. మాజీ స్పీకర్ మధుసూదనాచారి సహా బీఆర్ఎస్ తొలినాళ్ల కార్యకర్తలతో… సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్రతో పొసగడం లేదు. పాత, కొత్త నేతలతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ చీలిపోయింది. ఈసారి గండ్రకు బదులు ఆయన సతీమణి వరంగల్ జడ్పీ చైర్‌పర్సన్ జ్యోతి బరిలో నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్‌కు సన్నిహితుడిగా పేరున్న మధుసూధనాచారి.. టికెట్ మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. బీసీ నేతగా ఆదరణ ఉంటుందనే ఆత్మవిశ్వాసంతో నియోజకవర్గంలో పావులు కదుపుతున్నారు. మరి అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్. రేవంత్ రెడ్డి అనుచరుడు గండ్ర సత్యనారాయణతో పాటు.. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు కూడా ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న కొండా దంపతులు… చివరి నిమిషంలో భూపాపల్లిని చాయిస్‌గా ఎంచుకునే అవకాశం ఉందనే ప్రచారంతో కాంగ్రెస్‌లో ఉత్కంఠ కనిపిస్తోంది. బీజేపీ నుంచి మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కోడలు కీర్తి రెడ్డితో పాటు మాజీ పోలీస్ అధికారి రాం నర్సింహారెడ్డి టికెట్‌ రేసులో ఉన్నారు.

READ ALSO : Malkajgiri Lok Sabha Constituency : ఆసియాలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గంపై దేశమంతా ఆసక్తి….మల్కాజ్ గిరి పై పట్టుకోసం రాజకీయపార్టీల ప్రయత్నాలు

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంపై బీఆర్ఎస్‌కు గట్టిపట్టు ఉంది. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కారు పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుంటే.. ఏడు స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలపడం కాంగ్రెస్‌కు టాస్క్‌గా మారింది. బీజేపీ నాలుగు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తన్నాయ్. ఐతే ఎన్నికలకు మరో ఏడు నెలలకు పైగా సమయం ఉండడంతో.. ఎప్పుడు ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీంతో తెలంగాణ రాజకీయం మరింత ఆసక్తికరంగా కనిపిస్తోంది.