Amarnath Yatra: ఇదే ఫస్ట్ టైమ్.. అమర్నాథ్ యాత్ర ఈసారి 38 రోజులే.. కనీవిని ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు

ఇక యాత్ర కాన్వాయ్ కదలికల సమయంలో రక్షణ కోసం తొలిసారిగా జామర్లను ఏర్పాటు చేయనున్నారు.

Amarnath Yatra: ఇదే ఫస్ట్ టైమ్.. అమర్నాథ్ యాత్ర ఈసారి 38 రోజులే.. కనీవిని ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు

Updated On : June 5, 2025 / 9:13 PM IST

Amarnath Yatra: దక్షిణ కశ్మీర్‌లో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు ఏటా పవిత్ర అమర్‌నాథ్‌ యాత్రను నిర్వహిస్తారు. ఈ యాత్రకు వెళ్లేందుకు భక్తులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా అమర్నాథ్ యాత్రకు సిద్ధమయ్యారు. కాగా, ఎన్నడూ లేని విధంగా అమర్నాథ్ యాత్ర వ్యవధిని తగ్గించారు.

ఈసారి అమర్నాథ్ యాత్ర 38 రోజులు మాత్రమే సాగనుంది. జూలై 3న యాత్ర ప్రారంభం కానుంది. ఆగస్ట్ 9న ముగియనుంది. యాత్ర వ్యవధి తగ్గించడంతో పాటు భారీ స్థాయిలో అదనపు భద్రతను కల్పించనున్నారు. కేంద్ర సాయుధ పోలీసు దళాలకు చెందిన 581 కంపెనీలను అమర్నాథ్ యాత్రికుల భద్రత కోసం మోహరించనున్నారు. భద్రతకు సంబంధించి ఇంకా అనేక రకాల కీలక చర్యలు తీసుకున్నారు.

జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్రను దృష్టిలో పెట్టుకుని యాత్రికుల భద్రత కోసం కనీవిని ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్ర మార్గాలు, బేస్‌ క్యాంపులు, సున్నిత ప్రదేశాల్లో పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించనున్నారు. బాడీ స్కానర్లు, సీసీటీవీ కెమెరాలు, 24/7 నిఘాతో కూడిన మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేయనున్నారు.

ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ఆగస్ట్ 9 వరకు జరుగుతుంది. అంటే 38 రోజులే. ఇక యాత్ర కాన్వాయ్ కదలికల సమయంలో రక్షణ కోసం తొలిసారిగా జామర్లను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్ రక్షణ కల్పిస్తుంది. కాన్వాయ్ వెళ్లే సమయంలో యాత్రా మార్గాలు, జాతీయ రహదారులకు వెళ్లే అన్ని రహదారులను తాత్కాలికంగా దిగ్బంధించి వీలైనంత ఎక్కువ భద్రతను కల్పించనున్నారు.

యాత్రా మార్గాలను సురక్షితం, క్లియర్ చేయడానికి రోడ్ ఓపెనింగ్ పార్టీలు (ROP), తక్షణ ప్రతిస్పందన కోసం క్విక్ యాక్షన్ టీమ్స్ (QAT), పేలుడు పదార్థాలను గుర్తించడానికి, వాటిని నిర్వీర్యం చేయడానికి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ లు (BDS), కె 9 యూనిట్లు (ప్రత్యేకంగా శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్స్), వైమానిక నిఘా కోసం డ్రోన్లు ఏర్పాటు చేయనున్నారు.

జమ్మూకాశ్మీర్ లోని అమర్ నాథ్ గుహకు వెళ్లే పహల్గాం, బాల్తాల్ మార్గాల్లో ఈ ఏర్పాట్లు ఉంటాయి. భక్తులకు మరో కీలక ప్రకటన చేసింది అమర్ నాథ్ జీ పుణ్యక్షేత్రం బోర్డు. 13 ఏళ్ల లోపు వారు, 70 ఏళ్లు పైబడిన వారిని ఈ యాత్రకు అనుమతించబోమని తేల్చి చెప్పింది. తప్పనిసరి మెడికల్ సర్టిఫికెట్ కలిగి ఉన్నప్పటికీ ఆ ఏజ్ గ్రూప్ వారిని అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అంతేకాదు గర్భిణులను కూడా అనుమతించేది లేదంది. జూలై 3న మొదటి బ్యాచ్‌ యాత్రికులతో కూడిన బస్సులు శ్రీనగర్‌ నుంచి బయలుదేరతాయి.