Silk Worms Cultivation : పట్టుపురుగుల పెంపకంలో పట్టుసాధించిన యువరైతు
రైతులు మల్బరీ సాగులో తగిన మెళకువలు పాటించి, పట్టు పురుగుల పెంపకం పట్ల తగిన అవగాహనతో ముందడుగు వేస్తే స్వయం ఉపాధికి డోకా వుండదనేది, క్షేత్రస్థాయిలో రైతుల అనుభవాల ద్వారా నిరూపితమవుతోంది.

Vyavasayam
Silk Worms Cultivation : అతి వృష్టి, అనావృష్టి పరిస్తితుల కారణంగా వ్యవసాయంలో రైతుకు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి పెట్టిన పెట్టుబడే కాకుండా, పంటకాలాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలవైపు చూస్తున్న రైతుకు మల్బరిసాగు ఓ వరంలా కనిపిస్తోంది. పట్టుపురుగుల పెంపకంలో తక్కువ పెట్టుబడితో, ఏడాదంతా పంటలను తీసుకునే వెసులు బాటు ఉండటంతో రైతులు మల్బరీ సాగువైపు మొగ్గుచూపుతున్నారు. ఈ కోవలోనే రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువకుడు 3 ఎకరాల్లో ప్రణాళిక బద్దంగా మల్బరి సాగుచేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.
READ ALSO : Mixed Farming : ఒకే పంట విధానం కన్నా మిశ్రమ వ్యవసాయంతో అధిక లాభాలు..
పట్టుదల, అంకితభావం, నిరంతర పర్యవేక్షణ ఉంటే పట్టు పురుగుల పెంపకంలో వచ్చి ఆదాయం మరే పంటలో రాదు. అందుకే చాలా మంది సన్న, చిన్నకారు రైతులు వీటి సాగుచేపట్టి మంచి లాభాలను పొందుతున్నారు. రంగారెడ్డి జిల్లా, తలకొండపల్లి మండలం, గట్టుఇప్పల పల్లి గ్రామానికి చెందిన యువరైతు సయ్యద్ రఫీక్ ఇందుకు నిదర్శనం.
తక్కువ నీరు, అతి తక్కువ ఎరువుల వాడి, మల్బరి సాగులోమంచి ఫలితాలు పొందుతున్నారు. సన్న చిన్న కారు రైతులకు మంచి అవకాశంగా ఉన్న పట్టుపురుగుల పెంపకం, రోజు రోజుకు విస్తరిస్తోంది. తెలంగాణలో గతంలో రెండంకెల ఎకరాలకే పరిమితం అయిన మల్బరి సాగు ప్రస్తుతం 10 వేల 613 ఎకరాలకు విస్తరించింది.
READ ALSO : Organic Farming : సేంద్రీయ వ్యవసాయంలో నత్రజని పోషక లోప నివారణకు చేపట్టాల్సిన చర్యలు
రఫీక్ బిటెక్ పూర్తి చేశాడు. కొన్నాళ్ల పాటు ప్రైవేట్ ఉద్యోగం చేశాడు. సంతృప్తి నివ్వలేదు. అయితే వ్యవసాయంపై ఉన్న మక్కువతో సొంతంగా అగ్రిబిజినెస్ చేయాలనుకున్నారు. ఇందుకోసం వ్యవసాయం అనుబంధ రంగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అతితక్కువ పెట్టుబడితో.. ఏడాది పొడవునా అదిక పంటలు తీసుకునే వెసులుబాటు పట్టుపురుగుల పెంపకం చేపట్టారు. ఇందుకోసం 3 ఎకరాల్లో మల్బరీ మొక్కలను నాటారు. రెండు రేరింగ్ షెడ్ లను ఏర్పాటు చేసి… ఏడాదికి 8 నుండి 9 పంటల దిగుబడులను పొందుతున్నారు.
సాధారణంగా పట్టుపురుగుల పెంపక కాలం 25 రోజులు. దీనిలో గుడ్డునుంచి పిల్ల బయటకు వచ్చాక 18 రోజులు లార్వాదశలో వుంటుంది. ఆతర్వాత గూడుకట్టే దశలో మరో 5 నుంచి 6 రోజులు వుంటుంది. లార్వాదశలో 4 జ్వరాలు వుంటాయి. వీటిన మోల్టింగ్ దశ అంటారు. అయితే గుడ్డునుంచి పిల్ల బయటకు వచ్చే దశలో మొదటి 7రోజుల్లో వుండే రెండు జ్వరాలు అతి కీలకమైనవి. దీన్ని చాకీ దశ అంటారు. ఈ దశలో పురుగుల మరణాల శాతం అధికంగా వుంటుంది. ఇప్పుడు చాకీ దశను పట్టుశాఖ నియంత్రణలో పూర్తిచేసి, రైతులకు అందిస్తున్నారు. దీనివల్ల రైతులకు రిస్కు తగ్గటంతోపాటు 7రోజుల పంటకాలం కూడా తగ్గుతోంది. అంటే 18 నుంచి 20 రోజుల్లో పంట చేతికి వస్తుంది . 3 ఎకరాల్లో విడుతల వారిగా 600 గుడ్లను పెంచితే నెలకు లక్ష రూపాయల చోప్పున ఆదాయం పొందుతున్నారు.
READ ALSO : Types Of Soils : ఏ నేలల్లో ఏఏ పంటలు సాగుచేయాలి ? నేలల రకాలు.. పంటల ఎంపిక
ఇతర పంటలతో పోలిస్తే పట్టు పురుగల పెంపకం తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తోంది. ఎకరాకు రూ.3 నుండి 4 లక్షల వరకు నికర ఆదాయం చేకూరుతోంది. రైతులు మల్బరీ సాగులో తగిన మెళకువలు పాటించి, పట్టు పురుగుల పెంపకం పట్ల తగిన అవగాహనతో ముందడుగు వేస్తే స్వయం ఉపాధికి డోకా వుండదనేది, క్షేత్రస్థాయిలో రైతుల అనుభవాల ద్వారా నిరూపితమవుతోంది. నిరంతరం వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు, ఈ తోటలను కూడా సేద్యంలో భాగం చేసుకుంటే అధిక ఆదాయం పొందేందుకు ఆస్కారం ఉంది.