Jeevamrutham Preparation : నేలకు బలం.. పంటకు ఆరోగ్యం.. జీవామృతం తయారీ విధానం

పొలంలోనే నేరుగా తయారు చేసుకునే ఈ విధానాల పట్ల రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది మట్టిమనిషి. జీవామృతం తయారీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Jeevamrutham Preparation : నేలకు బలం.. పంటకు ఆరోగ్యం.. జీవామృతం తయారీ విధానం

jeevamrutham preparation and benefits in telugu

Jeevamrutham Preparation : రసాయన ఎరువులు, పురుగు మందులు అవసరంలేని ప్రకృతి వ్యవసాయం దేశవ్యాప్తంగా కాంతులీనుతోంది. దేశీ ఆవుల పేడ, మూత్రాలతో జీవామృతం, ఘన జీవామృతం వంటి సహజ ఎరువులను తయారుచేసి, సాగులో నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చు. పంచగవ్య పిచికారీతో పంట ఆరోగ్యంగా పెరగటంతోపాటు,చీడపీడలను తట్టుకునే స్వభావం పెరుగుతుంది. అయితే వీటి తయారీలో రైతులకు ఇంకా అనేక సందేహాలు. సులభంగా రైతు పొలంలోనే నేరుగా తయారు చేసుకునే ఈ విధానాల పట్ల రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది మట్టిమనిషి. జీవామృతం తయారీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నాటు ఆవుల పేడ మూత్రాలతో, రసాయనాలు అవసరం లేకుండా వ్యవసాయాన్ని సుభిక్షంగా కొనసాగించవచ్చని, ప్రకృతి వ్యవసాయ పితామహుడు డా. సుభాష్ పాలేకర్ ఇచ్చిన పిలుపుతో, దేశవ్యాప్తంగా సహజ సాగు పద్ధతులకు బీజం పడింది. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రైతులు ఇప్పటికే ఈ పద్ధతుల ఆచరణతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఎరువు అంటే ప్రధానంగా చెప్పుకునేది జీవామృతం. దీనిలో పంటలకు మేలుచేసే కోటానుకోట్ల బాక్టీరియ నిక్షిప్తమై వుండటం విశేషం. జీవామృతాన్ని పంటకు అందించినప్పుడు, ఈ బాక్టీరియా నేలలోని పోషకాలను కరిగించి మొక్కలకు అందిస్తుంది.

నెలరోజులకు ఒకసారి జీవామృతం :
నేల గుల్లబారటం వల్ల వానపాములు అభివృద్ధి చెంది భూమి మరింత బలవర్థకంగా తయారవుతుంది. స్వల్పకాలిక పంటలకు వారం నుండి 15 రోజులకు ఒకసారి, దీర్ఘకాలిక పంటలకు ప్రతి 15 నుండి నెలరోజులకు ఒకసారి జీవామృతాన్ని అందించాల్సి వుంటుంది. భూమిలోని సేంద్రీయ కర్బన శాతాన్నిబట్టి, జీవామృతాన్ని ఉపయోగించే అవసరం వుంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం, గుండుగొలను గ్రామ రైతులు ఆయిల్ పామ్, కూరగాయ తోటల్లో ప్రకృతి వ్యవసాయంతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. రైతు గోపాల కృష్ణమూర్తి ద్వారా జీవామృతం తయారీ గురించి తెలుసుకుందాం.

సాధారణంగా జీవామృతం కలిపిన 3వ రోజు నుండి 15 రోజులలోపు పంటలకు వాడుకోవాలి. అయితే ఇటీవల జరిగిన శాస్త్రీయ పరిశోధనల్లో దీన్ని కలిపిన 9 నుండి 15 రోజులలోపు వాడకుంటే పంటకు మేలుచేసే బాక్టీరియా మరింత వృద్ధిచెంది, మంచి ఫలితాలు వస్తున్నాయని తేలింది. మొక్క వయసునుబట్టి దీని వాడకం వుండాలంటారు రైతు. జీవామృతాన్ని నేలద్వారా ఎకరానికి 200లీటర్ల చొప్పున అందించవచ్చు.  పైపాటుగా మొక్కలపై పిచికారిచేయవచ్చు. ఆవుమూత్రంలో వుండే సుగణాల వల్ల చీడపీడల బెడద తగ్గుతుంది. పిచికారిచేసేటప్పుడు చిన్న మొక్కలు అయితే 10 లీటర్ల నీటికి 1 లీటరు జీవామృతం కలిపి పిచికారిచేయాలి. మొక్కల పెరిగిన తర్వాత ప్రతి 6 లీటర్ల నీటికి, 1 లీటరు జీవామృతం కలిపి పిచికారిచేస్తే పంట పెరుగుదల ఆరోగ్యంగా వుంటుంది.

ప్రస్థుతం టన్నులకొద్దీ పశువుల ఎరువును పొలానికి వాడే పరిస్థితి లేదు. ఈ విధానంలో రైతుకు ఖర్చు పెరుగుతున్న దృష్ట్యా ఎకరాకు 100 నుండి 500కిలోల ఘనజీవామృతం వాడటం ద్వారా పశువుల ఎరువుకంటే బలమైన పోషకాలను భూమికి అందించవచ్చు. ఘన జీవామృతం తయారీకి 100కిలోల నాటుఆవుల పేడ తీసుకుని దీనిలో 2 కిలోల పప్పుపిండి, 2కిలోల బెల్లం, 6 లీటర్ల నిల్వ వుంచిన ఆవుమూత్రం కలిపి బాగా కలియబెట్టాలి. దీన్ని నీడ ప్రదేశంలో నిల్వ వుంచి, ఆరిన తర్వాత వుండలు లేదా పిడకల రూపంలో నిల్వ చేసి 6 నెలలలోపు ఆఖరి దుక్కిలో వేసుకోవచ్చు.

మరో సులభమైన విధానం ఏంటంటే పశువుల ఎరువుల కుప్పను విడదీసి తయారైన జీవామృతాన్ని పొరలు పొరలుగా బాగా తడిచేటట్లు చల్లి నీడలో నిల్వ వుంచుకుంటే వారం రోజుల్లో ఘన జీవామృతం తయారవుతుంది. దీన్ని వెంటనే పొలంలో వాడుకోవచ్చు. 3 నుంచి 6 నెలల కాల వ్యవధి కలిగిన పంటలకు ఆఖరి దుక్కిలో ఘన జీవామృతం వేయాలి. దీర్ఘకాలిక పంటలకు ప్రతి 6 నెలలకు ఒకసారి ఘన జీవామృతం వేయాలి. దీనిద్వారా అతి తక్కువ ఖర్చుతో రైతులు మంచి ఫలితాలు సాధించే వీలుంది.

Read Also : Nursery Cultivation : ప్రో ట్రేలలో నారు పెంపకంతో ఉపయోగాలు.. సమయం, డబ్బు ఆదా