Ridge Gourd Cultivation : ఖరీఫ్‎కు అనువైన హైబ్రిడ్ బీర రకాలు- సాగు యాజమాన్యం

Ridge Gourd Cultivation : ఖరీఫ్‌లో పందిరి విధానంలో సాగు చేస్తూ, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే.. మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉన్నది. ఖరీఫ్ బీరసాగుకు అనువైన రకాలు.. సాగు యాజమాన్యం  ఎలా చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. 

Ridge Gourd Cultivation : ఖరీఫ్‎కు అనువైన హైబ్రిడ్ బీర రకాలు- సాగు యాజమాన్యం

Ridge Gourd Cultivation in Kharif

Updated On : June 8, 2024 / 3:27 PM IST

Ridge Gourd Cultivation : కూరగాయల సాగు.. రైతులకు ప్రతిరోజూ ఆదాయం తెచ్చిపెడుతున్నది. వ్యాపారులు, ఉద్యోగుల కన్నా ఎక్కువ సంపాదించే అవకాశం కల్పిస్తున్నది. అలాంటి కూరగాయల పంటలలో.. బీర ముఖ్యమైంది. తక్కువ సమయంలోనే పంట చేతికి వస్తున్నది. అంతేకాకుండా, ఈ కూరగాయకు మార్కెట్‌లో 365 రోజులూ మంచి డిమాండ్‌ ఉంటుంది. కాబట్టి ఖరీఫ్ లో పందిరి విధానంలో సాగు చేస్తూ, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే.. మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉన్నది. అయితే ఖరీఫ్ బీరసాగుకు అనువైన రకాలు.. సాగు యాజమాన్యం  ఎలా చేపట్టాలో  ఇప్పుడు చూద్దాం.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

పండించే రైతుకు ఆదాయాన్ని, వినియోగదారునికి ఆరోగ్యాన్ని అందించే పంటలు కూరగాయలు. అందుకే సీజన్ తో పనిలేకుండా సంవత్సరం పొడవునా కూరగాయలు పండిస్తుంటారు రైతులు . ముఖ్యంగా పందిరిజాతి కూరగాయలైన బీర, సొర, కాకర, దొండ, పొట్లను ఖరీఫ్ పంటగా జూన్ నుండి జులై వరకు విత్తుకోవచ్చు. వీటిలో బీరకు వానాకాలంలో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ పంటకు  నీటిని నిలుపుకునే తేలికపాటి ఎర్ర గరప మరియు బంకమట్టి నేలలు, ఉదజని సూచిక 6 నుండి 7 మధ్య ఉన్న నేలలు, మురుగునీరు పోయే సౌకర్యం గల ఒండ్రు నేలలు అనుకూలం. అధిక దిగుబడినిచ్చే అనేక రకాలను ఉద్యాన పరిశోధనా స్థానాలు రూపొందించాయి. ఇందులో ముఖ్యంగా జగిత్యాల లాంగ్‌, కో-1, కో-2 , పి.కె.యం-1 , పూసా నస్‌దర్‌ , సత్ పుతియ, అర్క సుమీత్, అర్క సుజాత ఉన్నాయి. వీటితో పాటు  సురేఖ, సంజీవిని, ఎన్.ఎస్- 3, యు.ఎస్ – 401, యు.ఎస్- 403, నాగ, మల్లిక, మహిమ లాంటి ప్రైవేట్ రకాలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇవి ఖరీఫ్ తో పాటు వేసవికి కూడా అనువైన హైబ్రిడ్ రకాలు

జగిత్యాల లాంగ్‌ రకం..
దీని కాయలు 50 నుండి 60 సెం.మీ. పొడవుతో సన్నగా, లోతైన కణుపులు కలిగి ఉంటాయి. ఖరీఫ్‌లో అధిక దిగుబడినిస్తుంది. కో-1 రకం  కాయలు 40 నుండి 50 సెం.మీ. పొడవుండి ఒక్కో కాయ 800 గ్రా. బరువు వరకు పెరుగుతుంది. పంట కాలం 125 రోజులు, ఎకరాకు 6 టన్నుల దిగుబడి వస్తుంది. కో-2 రకం.  ఈ రకం కాయలు చాలా పొడవు. దాదాపు 90 నుండి 100 సెం. మీ. వరకుంటాయి. ఒక్కో కాయ బరువు 700 నుండి 800 గ్రా. వరకు వుంటుంది. పంటకాలం  120 రోజులు, దిగుబడి ఎకరాకు 10 టన్నులు వస్తుంది.

పి.కె.యం-1 రకం :
కాయలు 60 నుండి 70 సెం.మీ. పొడవుతో, కాయ చివర వెడల్పుగాను, ముందు భాగం సన్నగాను ఉంటుంది. పంటకాలం 180 రోజులు. ఎకరాకు 6 నుండి 7 టన్నుల దిగుబడి వస్తుంది. పూసా నస్‌దర్‌ రకం 60 నుండి65 రోజులలోనే కాపుకు వస్తుంది. ఒక్కో తీగకు 15 నుండి 20 కాయలు కాస్తాయి. కాయలు లేత అకుపచ్చ రంగులోను, లోపలి గుజ్జు లేత పసుపు రంగులోను ఉంటుంది. ఈ రకం ఖరీఫ్‌కు, వేసవికి అనుకూలం. ఎకరాకు6 నుండి 7 టన్నుల దిగుబడి వస్తుంది. సత్‌ పుతియ .. ఈ రకంలో ద్విలింగ పుష్పాలుంటాయి. కాయలు గుత్తులుగా కాస్తాయి. కాయలు చిన్నగా ఉంటాయి. ఖరీఫ్‌, వేసవి కాలానికి అనువైనది.

అర్కసుమీత్ రకం..
దీని కాయలు 25 సెం. మీ. మందం, 55 సెం. మీ. పొడవుతో ఉంటాయి. 52 రోజులలో మొదటి కోతకు వస్తుంది. ఒక్కో తీగకు 13 నుండి 15 కాయలు వస్తాయి. ఒక్కో కాయ 380 గ్రాముల బరువు పెరుగుతుంది. పంటకాలం 120 రోజులు. ఎకరాకు 21 టన్నుల దిగుబడి వస్తుంది. అర్క సుజాత రకం.  కాయ 50 నుండి 55 సెంటీ మీటర్ల పొడువు ఉంటుంది. పంటకాలం 100 రోజులు. ఎకరాకు దిగుబడి 21 టన్నులు వస్తుంది. ఈ రకం కొంత వరకు బూజు తెగులును తట్టుకుంటుంది. విత్తే ముందే నేలను సిద్ధం చేసుకోవాలి.

పొలాన్ని 3 నుండి 4 సార్లు బాగా దున్ని ఆఖరి దుక్కిలో ఎకరాకు పశువుల ఎరువు 6 నుండి 8 టన్నులు వేసి కలియదున్నాలి. 60 నుండి 80 సెం. మీ. దూరంతో కాలువలు చేసుకోవాలి. రెండు కాలువల మధ్య దూరం 2 మీటర్లు ఉండేటట్లు చూడాలి. ఎకరాకు 600 నుండి 800 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. ఇందుకోసం ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు మందును కిలో విత్తనానికి పట్టించి ఆ తరువాత ట్రైకోడెర్మా విరిడి 5 గ్రాములు లేదా థైరమ్ 3 గ్రాములు లేదా 3 గ్రాములు  క్యాప్టాన్ పొడి మందు కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి.

వర్షాకాలంలో విత్తేటప్పుడు రెండు పాదుల మధ్య దూరం  75 సెం. మీ. ఉండేటట్లు చూసుకోవాలి. ఒక్కో పాదుకు 3 నుండి 5 గింజలను 1 నుండి 2 సెంటీ మీటర్ల లోతులో విత్తుకోవాలి. విత్తిన 8 నుండి 10 రోజులకు గింజలు మొలకెత్తుతాయి. బలమైన 2 మొక్కలను ఉంచి మిగిలిన వాటిని జాగ్రత్తగా తీసివేయాలి. ఒక వేళ ఖరీఫ్‌లో త్వరగా పంట వేయాలంటే మే నెలలోనే పాలిథిన్‌ సంచులలో గింజలను విత్తుకొని, రెండు ఆకుల దశలో  అంటే విత్తిన 15 నుండి 20 రోజులకు పొలంలో నాటుకోవాలి. నాటేటప్పుడు, జాగ్రత్తగా పాలిథిన్‌ సంచులను తీసి, మట్టి గడ్డ ఏ మాత్రం చెదరకుండా గుంతలో పెట్టి మన్ను కప్పాలి. ఈ విధంగా చేస్తే మొక్కలు త్వరగా నిలదొక్కుకొని బాగా పెరుగుతాయి.

బీర సాగులో ఎరువుల యాజమాన్యం కీలకం. ఎకరాకు 24 నుండి 32 కిలోలు, భాస్వరం, పొటాష్‌ను బాగా కలివి అన్ని గుంతలలో సమానంగా నింపాలి. ఎకరాకు నత్రజని 32 నుండి 40 కిలోలు చొప్పున రెండు భాగాలుగా చేసి, ఒక భాగం విత్తిన 20 నుండి 25 రోజులకు, రెండవ భాగం 50 నుండి 60 రోజులకు వేసి నీరుకట్టాలి. ఎరువులు మొక్కకు 10 నుండి 15 సెం.మీ. దూరంలో వేసి, మట్టి ఎగదోసి నీరు పారించాలి. పంటలో ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను నివారించాలి.

గింజలు విత్తిన 2 నుండి 3 రోజులలో అలాక్తోర్‌ లేదా బ్యూటాక్లోర్‌  800 గ్రాములు కిలోల 200 లీటర్ల నీటిలో కలిపి తడినేలపై పిచికారి చేయాలి. దీని వలన 30 రోజుల వరకు కలుపురాదు. అ తర్వాత 45 రోజులకొకసారి పాదుచుట్టూ తేలికగా మట్టిని గుల్లచేసి, మొక్కదగ్గరకు ఎగదోయాలి. పొడుగు బీర రకాలకు పందిరి తప్పనిసరీ వేయాలి. బీర రెండు అకుల దశలో 3 నుండి 4 గ్రా. బోరాక్స్‌, లీటరు నీటికి కలిపి పిచికారి చేస్తే ఆడపూలు అధికంగా వస్తాయి. లేదా ఇథరిల్‌ 2.5 మి.లీ. పది లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధితో రెండుసార్లు పిచికారీ చేసినట్లయితే కాయల అధికంగా కాసి ఎకరాకు 6 నుండి 8 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.

Read Also : Pests Methods Banana : అరటిలో తెగుళ్లు నివారించే పద్ధతులు