సేద్యానికి వరప్రదాయిని వేసట్ డీ కంపోజర్.. తెగుళ్లకు చెక్

వ్యవసాయంలో వినూత్న విప్లవానికి నాందిగా నిలిచింది వేస్ట్ డీకంపోజర్. కేవలం 20 రూపాయలతో కొనుగోలుచేసిన ఒక చిన్న బాటిల్ సేద్య స్తితిగతులను మార్చేస్తోంది.

సేద్యానికి వరప్రదాయిని వేసట్ డీ కంపోజర్.. తెగుళ్లకు చెక్

Waste Decomposer Making: వ్యవసాయంలో వేస్ట్ డీకంపోజర్ వాడకం రైతులకు వరంగా మారింది. సాగులో అనాదిగా భూమి ద్వారా పట్టి పీడిస్తున్న శిలీంధ్రపు తెగుళ్ల సమస్యకు వేస్ట్ డీకంపోజర్ చక్కటి పరిష్కారంగా నిలుస్తోంది. భూసారాన్ని పెంచటంతోపాటు, రైతులకు సాగు ఖర్చును తగ్గిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్, ఘజియాబాద్ లోని జాతీయ సేంద్రీయ వ్యవసాయ సంస్థ జరిపిన పరిశోధనల ఫలితంగా ఆవుపేడ నుండి సేకరించిన 3 రకాల బాక్టీరియాల ద్వారా ఈ ఉత్పత్తిని రూపొందించారు. కేవలం 20 రూపాయల ఖర్చుతో రైతులు దీన్ని స్వయంగా అభివృద్ధి చేసుకుని, ఏళ్ల తరబడి పంటలకు వాడుకోవచ్చు. వేస్ట్ డీకంపోజర్ ను అభివృద్ధిచేసుకునే విధానం, దీనివల్ల ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వ్యవసాయంలో వినూత్న విప్లవానికి నాందిగా నిలిచింది వేస్ట్ డీకంపోజర్. కేవలం 20 రూపాయలతో కొనుగోలుచేసిన ఒక చిన్న బాటిల్ సేద్య స్తితిగతులను మార్చేస్తోంది. దీనితో తయారు చేసిన ద్రావణాన్ని ఎకరాకు 200 లీటర్ల చొప్పున 6 రోజుల వ్యవధితో 4 సార్లు అందిస్తే చాలు భూమిలో సేంద్రీయ కర్బనశాతం అనూహ్యంగా పెరుగుతోంది. దీనివల్ల టన్నులకొద్దీ పశువుల ఎరువు వాడకుండానే రైతులు సులభంగా పంటలు పండిస్తున్నారు. చీడపీడల సమస్యను అధిగమిస్తున్నారు.

ఆవుపేడలోని కొన్ని రకాల బాక్టీరియా ద్వారా జాతీయ సేంద్రీయ వ్యవసాయ సంస్థ, ఘజియాబాద్ శాస్త్రవేత్తలు ఈ ఉత్పత్తిని రూపొందించారు. పంటలకే కాక, సేంద్రీయ వ్యవసాయ వ్యర్ధాలను త్వరగా కుళ్లబెట్టేందుకు కూడా ఈ వేస్ట్ డీకంపోజర్ ఉపయోగపడుతుంది. సాధారణంగా వర్మీకంపోస్టు తయారు చేయటానికి సగం మాగిన పశువుల ఎరువు, కుళ్లిన చెత్తను ఉపయోగిస్తాం. ఇవి కుళ్లాలంటే కనీసం 5,6 నెలల సమయం పడుతుంది. కానీ వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని పొరలు పొరలుగా ఈ వ్యర్థాలపై చల్లితే త్వరగా కుళ్లుతుంది. వేస్ట్ డీకంపోజర్ వల్ల వ్యవసాయంలో ప్రయోజనాలు అనేకం అంటారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం సీనియర్ శాస్త్రవేత్త డా. సతీష్.

Also Read: పట్టుపురుగుల పెంపకంతో.. ప్రభుత్వ ఉద్యోగి మాదిరి నెల నెలా జీతంలా సంపాదిస్తూ..

ఒకసారి తయారైన వేస్ట్ డీకంపోజర్ ను రైతులు మళ్లీ మళ్లీ అభివృద్ధి చేసుకోవచ్చు. 5 లీటర్ల వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని తిరిగి 200లీటర్ల నీటిలో కలిపి 2కిలోల బెల్లపు మడ్డిని వేసి, రోజు ఉదయం సాయంత్ర కలియదిప్పితే తిరిగి 5 నుండి 6 రోజుల్లో వేస్ట్ డీకంపోజర్ ద్రావణం తయారవుతుంది. తయారైన ద్రావణం పుల్లటి వాసన వస్తుంది. ఈ విధానంలో రైతులు తమ పంట అవసరాలకు అనుగుణంగా డ్రమ్ములు లేదా సిమెంటు ట్యాంకుల్లో వేల లీటర్ల ద్రావణాన్ని తయారుచేసి పంటలకు అందిస్తున్నారు. దీన్ని మొక్కలకు అందించటం వల్ల భూమిలో సేంద్రీయ కర్బన శాతం పెరుగుతుంది. భూమి ద్వారా ఆశించే శిలీంధ్రపు తెగుళ్లు, నులిపురుగుల బెడద వుండదు.

Also Read: భారత్ నుంచి వచ్చే చీరలు, మసాలాలు వాడొద్దు..! భారత్‌పై విషం చిమ్ముతున్న బంగ్లాదేశ్.. ఎందుకిలా?

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే వేస్ట్ డీకంపోజర్ వాడకం విస్తృతమవుతోంది. అయితే మారుమూల గ్రామాల్లో రైతులకు ఇంకా దీనిపై సరైన అవగాహన లేదు. వ్యవసాయ శాఖ, ప్రతీ రైతుకు దీన్ని అందుబాటులోకి తెచ్చి, రైతులకు అవగాహన కల్పిస్తే, భూసారం పెరగటంతోపాటు, రైతులు తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధించే వీలు ఏర్పడుతుంది.