నన్ను చంపాలని చూస్తున్నారు- వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేతిరెడ్డి అనుచరుడి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.
Kethireddy Pedda Reddy : అనంతపురం జిల్లా తాడిపత్రి తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి యత్నిస్తున్నారని ఆయన చెప్పారు. తాను తాడిపత్రికి రాకూడదని దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా అడ్డొస్తాననే నాపై దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో తాడిపత్రిలో మా అన్న సూర్యప్రతాప్ రెడ్డిని హత్య చేశారని చెప్పారు. వైసీపీ నేత మురళి ఇంటిపై దాడి చేయడం బాధాకరం అని కేతిరెడ్డి వాపోయారు.
నేను తాడిపత్రి రాకుండా ఎవరూ అడ్డుకోలేరు అని కేతిరెడ్డి పెద్దారెడ్డి తేల్చి చెప్పారు. ఊపిరి ఉన్నంతవరకు తాడిపత్రిలోనే ఉంటానని స్పష్టం చేశారాయన. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జేసీ అస్మిత్ రెడ్డిని రాజకీయంగా పైకి తీసుకొచ్చి నన్ను అంతమొందించాలని జేసి ప్రభాకర్ రెడ్డి చూస్తున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు.
కాగా, తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తన ఇంట్లో ఉన్న కీలకమైన డ్యాక్యుమెంట్స్ తీసుకోవడానికి పెద్దారెడ్డి వెళ్లారు. ఈ విషయం తెలిసిన వెంటనే టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు. మరోవైపు కేతిరెడ్డి అనుచరుడి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అలర్ట్ అయిన పోలీసు యంత్రాంగం 200 మంది అదనపు బలగాలను తాడిపత్రికి పంపింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులను మోహరించారు.
Also Read : ఎన్నికలకు ముందు ఓ లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క.. పిఠాపురంపై మెగా హీరోల ఫోకస్, ఏం చేయబోతున్నారంటే..
