13Th Day..రాజధానిలో ఆగని ఆందోళనలు

రాజధాని ప్రాంతంలో ఆందోళనలకు ఫుల్ స్టాప్ పడడం లేదు. ఎక్కడికక్కడ ఆందోళనలు, నిరసనలు కంటిన్యూ చేస్తున్నారు. వినూత్నంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మహిళలు, రైతులు, విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 2019, డిసెంబర్ 30వ తేదీ సోమవారానికి 13వ రోజుకు చేరుకున్నాయి. సచివాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇటువైపు వచ్చే రహదారిని రైతులు దిగ్భందించారు. దీంతో పోలీసులు మోహరించి..ఐడీ కార్డులున్న వారికే అనుమతినిస్తున్నారు. తుళ్లూరులోని తులసీ థియేటర్స్ వద్ద మహాధర్నా జరుపుతున్నారు. రోడ్లపైనే వంట వార్పు నిర్వహిస్తున్నారు. దీంతో కొంత ట్రాఫిక్ స్తంభించింది.
మందడంలో రైతులు చేస్తున్న ధర్నాకు ఆంధ్రా మేధావుల సంఘం మద్దతు ప్రకటించింది. ఈ సందర్బంగా చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ…రాజధాని వికేంద్రీకరణకు ఒప్పుకోమన్నారు. మిగతా ప్రాంతాల్లో రాజధాని డిమాండ్ లేనప్పుడు తరలించడం ఎందుకని ప్రశ్నించారు.
మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన, GN RAO కమిటీ ఇచ్చిన నివేదికతో అమరావతి ప్రజలు భగ్గుమన్నారు. తమకు మూడు రాజధానులు వద్దని, అమరావతే రాజధానిగా ఉండాలంటూ డిమాండ్ చేశారు. 13 రోజులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారిని శాంతింప చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. రాజధానిపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేదని వెల్లడిస్తోంది.
ఈ క్రమంలో హైపవర్ కమిటీ వేస్తున్నట్లు, మూడు వారాల్లో నివేదిక వచ్చిన అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించింది. కొంతమందిని రెచ్చగొడుతున్నారని, శాంతియుతంగా చేస్తే..ఎలాంటి అభ్యంతరం లేదని, మితిమీరితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇప్పటికే ఏపీ డీజీపీ హెచ్చరించారు కూడా.
* మందడం రహదారిపై టెంట్ వేసి రైతుల ధర్నా.
* సచివాలయానికి వెళ్లే రహదారి దిగ్భందం.
* రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ..మహిళల ప్రార్థనలు.
* లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుతున్న మహిళలు.