విజయవాడ కనకదుర్గ గుడిలో కరోనా కలకలం..ఎంతమంది అంటే..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయానికి కరోనా సెగ తగలింది. ఆలయ ఈవో సహా 18 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈవో సురేష్ బాబు కొద్దిరోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయనతో పాటు ఆలయ పూజారులు కూడా కరోనా బారినపడ్డారు. శ్రావణ మాసం కావడంతో ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్న క్రమంలో మరింత టెన్షన్ పట్టుకుంది. పారిశుద్ద్య కార్మికులు ఆలయ పరిసరాల్లో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తూ చర్యలు కొనసాగిస్తున్నారు.
కాగా ఇటీవల ఆలయంలో పూజలు చేసే వేదపండితుడు రామకృష్ణ ఘనాపాటి కూడా ఇటీవల కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత అతనికి చికిత్స అందించగా పరిస్థితి విషమించటంతో చికిత్స తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఆయన భార్య కూడా ఐసీయూలోనే ఉన్నారు. దీంతో మోత్తం దుర్గగుడిలో 18 మందికి వైరస్ సోకిందని అధికారులు వెల్లడించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. నిబంధలు పాటించటం..అమలు చేయటంతో ఎటువంటి మినహాయింపులు లేవని కచ్చితంగా పాటించి తీరవలసిందేనని కమిటీ తీర్మానించింది.