Vidadala Rajini: 30 మంది అరెస్టు.. వారంతా అమాయకులన్న నక్కా ఆనంద్ బాబు
వైసీపీ నేతలకే ఇష్టం లేదని, ఆ పార్టీలోని గ్రూపు తగాదాలతో వాళ్లే రాళ్లు విసురుకున్నారన్న అనుమానం ఉందని తెలిపారు. దీనిపై విచారణ జరపాలని అన్నారు.

Nakka ananda babu
న్యూఇయర్ వేడుకల వేళ గుంటూరు, చంద్రమౌళినగర్‌లోని మంత్రి విడదల రజిని కొత్త కార్యాలయంపై కొందరు దుండగులు రాళ్ల దాడి చేసిన ఘటనలో పోలీసులు 30 మందిని అరెస్టు చేశారు. నిందితులను వైద్య పరిక్షల నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు.
జీజీహెచ్‌లో నిందితులతో మాట్లాడిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, స్థానిక టీడీపీ నేతలు.. వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ… న్యూఇయర్ వేళ ఎన్టీఆర్ విగ్రహానికి ప్రతి ఏడాది నివాళులు అర్పిస్తారని చెప్పారు. ఆ ప్రాంతంలో విడదల రజనీ ఆఫీస్ పెట్టారంటూ ఆంక్షలు విధించారని తెలిపారు.
ఎన్టీఆర్ విగ్రహం వద్దకు రాకుండా అడ్డుకున్నారని నక్కా ఆనంద్ బాబు చెప్పారు. ఆ సమయంలో రజనీ ఆఫీసుపై రెండు రాళ్లు పడ్డాయట అని తెలిపారు. ఈ మాత్రం దానికే పోలీసులు, వైసీపీ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. వైసీపీ నేతలు అరాచకం సృష్టించారని తెలిపారు. కొందరిపై తప్పుడు కేసులు పెట్టించారని చెప్పారు.
వైసీపీ సర్కారు నుంచి ఒత్తిడి రావడంతో పోలీసులు అమాయకులపై కేసులు పెట్టారని నక్కా ఆనంద్ బాబు అన్నారు. విడదల రజనీ ఇన్‌చార్జ్‌గా రావడం అసలు వైసీపీ నేతలకే ఇష్టం లేదని, ఆ పార్టీలోని గ్రూపు తగాదాలతో వాళ్లే రాళ్లు విసురుకున్నారన్న అనుమానం ఉందని తెలిపారు. దీనిపై విచారణ జరపాలని అన్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు