ఏపీలో 24 గంటల్లో 11 కరోనా మరణాలు, 793 కేసులు

ఏపీలో కరోనా తీవ్ర కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 793 పాజిటివ్ కేసులు నమోదవగా, మరో 11 మంది కరోనాతో చనిపోయారు. కొత్తగా నమోదైన కేసుల్లో రాష్ట్రానికి చెందిన వారు 706 మంది ఉండగా.. ఇతర రాష్ట్రాల్లోని వారు 81 మంది, ఇతర దేశాల్లోని వారు ఆరుగురు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 13,891కి చేరింది. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ఒకరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు కరోనాతో మరణించారు.
180కి పెరిగిన కరోనా మరణాల సంఖ్య:
ఏపీలో ఇప్పటివరకు కరోనా నుంచి 6232 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 7వేల 479. కరోనా మరణాల సంఖ్య 180కి పెరిగింది. గత 24 గంటల్లో నమోదైన 793 కేసుల్లో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 96 కేసులు నమోదు కావడం అనంత ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.
1873 కరోనా కేసులతో టాప్‌లో కర్నూలు జిల్లా:
రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదవుతున్న జిల్లాల్లో కర్నూలు జిల్లా(1873) టాప్ లో ఉంది. ఆ తర్వాత అనంతపురం జిల్లా(1467), కృష్ణా జిల్లా(1383) , గుంటూరు జిల్లా (1291), తూర్పుగోదావరి జిల్లా(1074)ఉన్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో మళ్లీ లాక్ డౌన్ విధించారు. ఈ నెల 21వ తేదీ నుంచి అనంతపురం జిల్లాలో లాక్ డౌన్ మళ్లీ అమలు చేసినప్పటికీ జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం లేదు. లాక్ డౌన్ నిబంధనలు పాటించి కరోనా కట్టడికి సహకరించాలని ప్రజలను అధికారులు కోరారు.
Read: వారి ఖాతాల్లో రూ.455 కోట్లు జమ చేసిన సీఎం జగన్