అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం.. పూర్తి వివరాలు తెలిపిన ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత

ప్రభుత్వ అధికారులు ఈ కేసులో దోషులుగా ఉన్నారని అన్నారు. అందుకే..

అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం.. పూర్తి వివరాలు తెలిపిన ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత

అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్ సహా మిగతా 9 మందిపై సీఐడీ, ఏసీబీ కేసులు నమోదయ్యాయి. ఇందులో కీలకంగా వ్యవహరించారు సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వర రావు, తహసీల్దార్ జాహ్నవి. ఏసీబీ నమోదు చేసిన కేసులో 712 సెక్షన్ 4, 120బీ, 420 సెక్షన్ల కింద కేసు నమోదైంది.

సీఐడీ నమోదు చేసిన కేసులో 420, 409, 467, 471, 120బీ, రెడ్ విత్ 34 సెక్షన్ కింద కేసులు నమోదయ్యాయి. కేసులో ఏ1 జోగి బాబాయ్ జోగి వేంకటేశ్వర రావు హౌస్ అరెస్ట్ అయ్యారు.

ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ భూముల విషయంలో అవకతవకలు జరిగాయని తెలిపారు. ఇద్దరిని ఈరోజు అరెస్టు చేశామని తెలిపారు. అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబర్ ను కూడా మార్చారని తెలిపారు. ఏసీబీ అధికారుల విచారణలో అవకతవకలు నిజమని తేలాయని చెప్పారు. సీఐడీ అధికారుల నివేదికను కూడా తెప్పిస్తున్నామని అన్నారు.

అగ్రిగోల్డ్ ఆస్తులు సీఐడీ అటాచ్‌మెంట్లో ఉన్నాయని తెలిపారు. తమ విచారణలో పీసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని చెప్పారు. ప్రభుత్వ అధికారులు ఈ కేసులో దోషులుగా ఉన్నారని అన్నారు. అందుకే విచారణ వేరుగా సాగిస్తున్నామని తెలిపారు. సీఐడీ, ఏసీబీ అధికారుల విచారణ నివేదికలు ఉన్నతాధికారులకు వివరిస్తామని చెప్పారు.

తమ దర్యాప్తులో ఇప్పటివరకు ఐదుగురు పేర్లు ఉన్నాయని తెలిపారు. జోగి రమేశ్ పాత్రపై విచారణ జరుగుతోందని, నిర్ధారణ అయితే కేసు నమోదు చేస్తామని చెప్పారు. సర్వేయర్ రమేశ్, జోగి రాజీవ్ ను ఇప్పటి వరకు అరెస్టు చేశామని, వారిద్దరినీ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.

Also Read: వీరే దేశానికి నిజమైన హీరోలు.. సెల్యూట్: పవన్ కల్యాణ్