APలో ACB ఫీవర్ : అవినీతిపరుల పేర్లను చెప్పాలి – ACB DG లేఖ

  • Published By: madhu ,Published On : February 28, 2020 / 08:57 AM IST
APలో ACB ఫీవర్ : అవినీతిపరుల పేర్లను చెప్పాలి – ACB DG లేఖ

Updated On : February 28, 2020 / 8:57 AM IST

ఏపీలో అవినీతికి చెక్ పెట్టేందుకు ఏసీబీ దూకుడు పెంచుతోంది. లంచావతారాల పీచమణించేందుకు తనిఖీలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ శాఖల్లో అవినీతి అధికారులు, సిబ్బంది వివరాలు చెప్పాలని ఏసీబీ కోరింది.  ఈ మేరకు 2020, ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్‌కు ఏసీబీ డీజీ లేఖ రాశారు. రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామస్థాయి వరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగుల వివరాలు తెలుపాలని సర్క్యూలర్ జారీ చేసింది.

అవినీతి ఆరోపణలతో అరెస్టయిన వారి వివరాలు పూర్తిగా తెలియచేయాలని ప్రభుత్వ శాఖకు సూచనలు జారీ చేసింది. మరోవైపు 2019, జూన్ 01వ తేదీ నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయి వివరాలు ఉండాలని జీఏడీ కోరింది. అన్ని శాఖల ప్రిన్స్‌పల్ సెక్రటరీలు, హెచ్‌వోడీలకు సర్క్యూలర్ జారీ చేసింది. 

వారానికొకసారి ఏసీబీ అధికారులు తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా రాష్ర్టంలో అవినీతి నిరోధక శాఖ అలజడి రేపుతోంది. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ శాఖలపై గురి పెట్టింది. అందుకే వారానికి ఓ ప్రభుత్వ శాఖను టార్గెట్‌ చేసి దాడులు, తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటికే టౌన్ ప్లానింగ్ శాఖ, తహశీల్దార్ల కార్యాలయాలు, రిజిస్ర్టేషన్ శాఖపై దాడుల చేసిన ఏసీబీ తాజాగా ప్రభుత్వ ఆసుపత్రులను టార్గెట్‌ చేసింది. 

అవినీతి ఆరోపణల్లో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే సేవలు కూడా మామూళ్లు అందనిదే ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. ఆదాయం సర్టిఫికెట్ నుంచి.. పెద్ద కాంట్రాక్టు వరకు అన్నింటా అవినీతి రాజ్యమేలుతోంది. దీన్ని నివారించడం కోసం ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబరు కూడా ప్రవేశపెట్టింది. ఐతే.. దీనికి వచ్చే ఫిర్యాదులపై చూసి సీఎం జగన్‌ ఆశ్యర్యపోయారు. అవినీతి ఆరోపణలు వచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రతిరోజూ ఎసీబీ కేసుల నివేదికను డీజీ సీఎంకు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే వారానికి ఒక శాఖను తీసుకొని తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నారు.

రాష్ర్టంలో అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఎదుర్కొనే శాఖల్లో వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్, తూనికలు, కొలతలు, రవాణా, మెడికల్ అండ్ హెల్త్, పురపాలకశాఖ, ట్రెజరీ, రెవిన్యూ విభాగాలు ఉంటాయి. ఏపీని అవినీతి రహిత రాష్ర్టం చేయాలన్నది తన సంకల్పమని సీఎం జగన్ పదే పదే చెబుతుంటారు. దీనికి అనుగుణంగా అనేక చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు. ఓవైపు ఏసీబీ దాడులు చేస్తున్నా.. అవినీతి అధికారులు మాత్రం మారడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాలని ఎసీబీ డీజీని ఆదేశించారు. నిత్యం తాను సమీక్ష చేస్తానని, అవినీతి పాల్పడితే.. ఏస్థాయి వారైనా సరే ఉపేక్షించొద్దని సూచించారు. ఈ దిశగానే ఎసీబీ పయనిస్తోంది. 

Read More : పోలీసులపై FIR నమోదు చేయాలి, రూ. 50 లక్షలివ్వాలి – దిశ నిందితుల కుటుంబాలు