అగ్రిగోల్డ్ మోసాలు.. విదేశాల్లో దాచిన సొమ్ము..దీవుల్లో దొంగలు

అగ్రిగోల్డ్ మోసాలు.. విదేశాల్లో దాచిన సొమ్ము..దీవుల్లో దొంగలు

Updated On : December 24, 2020 / 6:33 PM IST

Agrigold scams..a huge amount of money hidden abroad : అగ్రిగోల్డ్ సంస్థ… ప్రజల నుంచి వేల కోట్లు వసూలు చేసి దుకాణం మూసేసిన సంస్థ. 7 రాష్ట్రాల్లో 6వేల 300 కోట్ల డిపాజిట్లు సేకరించిన అగ్రిగోల్డ్ సంస్థ… ఆ సొమ్మును సొంత ఖాతాల్లోకి మళ్లించుకుంది. కానీ ఇప్పటి వరకు అందరి మదిలో ఉన్న ప్రశ్న ఒకటే… దోచేసిన సొమ్ము ఏం చేశారు…. ఆ డబ్బులు ఎక్కడ పెట్టారు… అవి ఏ రూపంలోకి మార్చారు… దాదాపు ఐదేళ్లుగా ఇదే ప్రశ్న… ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరికింది. అగ్రిగోల్డ్ సంస్థ వ్యవహారాలపై లోతైన దర్యాప్తు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు… అగ్రిగోల్డ్ గుట్టును బయటపెట్టారు.

భారీగా విదేశాల్లో దాచిన అగ్రిగోల్డ్‌ సొమ్ము జాడ ఎట్టకేలకు బహిర్గతమైంది. సంస్థ యాజమాన్యం ఆ మొత్తాన్ని కరీబియన్‌ సముద్రంలోని కేమన్‌ దీవుల్లో దాచినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకోసం విదేశాల్లో ఆర్థికపరమైన సేవలందించే పనామా సంస్థ మొసాక్‌ ఫొన్సెంకా సహకారం తీసుకున్నట్లు తేలింది. కేమన్‌ దీవుల్లో డొల్ల కంపెనీలు సృష్టించి పెట్టుబడులను మళ్లించడం ద్వారా అగ్రిగోల్డ్‌ యాజమాన్యం మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. ఆకర్షణీయ పథకాలతో 7 రాష్ట్రాల్లో సుమారు 32 లక్షల మంది డిపాజిట్‌దారులను మభ్యపెట్టి దాదాపు 6 వేల 380 కోట్ల రూపాయలను అగ్రిగోల్డ్ సంస్థ సేకరించింది.

ఈ వ్యవహారంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ దర్యాప్తు చేయగా మనీలాండరింగ్‌ కోణం బహిర్గతం కావడంతో ప్రస్తుతం ఈడీ దృష్టి సారించింది. సంస్థ ఛైర్మన్‌ అవ్వ వెంకట రామారావు, డైరెక్టర్లు వెంకట శేషు నారాయణరావు, హేమసుందర వరప్రసాద్‌ను అరెస్ట్‌ చేసిన ఈడీ… హైదరాబాద్‌లోని ఈడీ పీఎంఎల్‌ఏ కోర్టులో హాజరుపరిచింది. న్యాయస్థానం నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. మరింత లోతుగా విచారించేందుకు నిందితులను కస్టడీకి అప్పగించాలని ఈడీ పిటీషన్‌ దాఖలు చేసింది.

ఈడీ దర్యాప్తుతో యాజమాన్యం నిర్వాకాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ సంస్థ ఏడు రాష్ట్రాల్లో డిపాజిట్లు సేకరించినట్లు ఈడీ గుర్తించింది. స్థిరాస్తి వ్యాపారం పేరిట ఏజెంట్లను చేర్చుకున్న సంస్థ.. వారి ద్వారా పెద్దఎత్తున డిపాజిట్లు సేకరించింది. డిపాజిటర్ల పేరిట కేటాయించినట్లు చెప్పిన ప్లాట్లకు హద్దులు నిర్ణయించకుండా, లొకేషన్‌ చెప్పకుండా, వాస్తవ మార్కెట్‌ విలువ ప్రస్తావించకుండా, సర్వే నంబర్లు వెల్లడించకుండా మాయ చేసింది. పేరుకే స్థిరాస్తి వ్యాపారమని చెప్పినా.. ఆర్‌బీఐ నుంచి అనుమతులు లేకుండానే డిపాజిట్లు సేకరించింది.

ఈ నిర్వాకాన్ని గుర్తించిన సెబీ వెంటనే వ్యాపార కార్యకలాపాల్ని ఆపేసి డిపాజిట్‌దారులకు సొమ్ము తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. దాన్ని పట్టించుకోని ఛైర్మన్‌ అవ్వ వెంకట రామారావు.. కొత్త కంపెనీలను తెరపైకి తెచ్చి కమీషన్‌ ఏజెంట్ల ద్వారా భారీగా డిపాజిట్లు సేకరించారు. ప్రక్రియ కాస్తా పొంజి స్కామ్‌గా రూపాంతరం చెందింది. ఈ క్రమంలో ప్లాట్లు ఇస్తామంటూ 32లక్షల మంది నుంచి తీసుకున్న సొమ్ముకు చివరకు దాదాపు 5.3లక్షల ప్లాట్లు మాత్రమే వెంచర్లలో ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.

స్థిరాస్తి వ్యాపారం పేరిట డిపాజిట్లు సేకరించిన యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ఇతర రంగాలకు 942.96 కోట్ల రూపాయల నిధుల్ని మళ్లించింది. విద్యుత్ సంస్థలు మొదలు సాఫ్ట్‌వేర్ పబ్లిషింగ్‌, బీమా, గనులు, వ్యవసాయం, హోటల్స్ ఇలా మొత్తం 17 సంస్థల్లో మళ్లించిన నిధులతో అగ్రిగోల్డ్ యాజమాన్యం పెట్టుబడులు పెట్టింది. ఓ వైపు ఎన్నో మాయమాటలు చెప్పి డిపాజిట్లు సేకరించిన సంస్థ… ఆ నిధులను అంతే చాకచక్యంగా దారి మళ్లించాయి. ఏకంగా 942 కోట్ల రూపాయలను డొల్ల కంపెనీల ద్వారా ఖండాంతరాలు దాటించారు.