కౌంటింగ్ రోజు అల్లర్లు జరగకుండా.. కడప జిల్లా నుంచి 21 మంది రౌడీషీటర్ల బహిష్కరణ
నేటి నుంచి 21 మంది రౌడీ షీటర్లపై జిల్లా బహిష్కరణ విధించారు. ఈ సాయంత్రం నుంచి జూన్ 7వ తేదీ వరకు జిల్లాలోకి వీరికి అనుమతి నిరాకరించారు.

Andhra Pradesh counting of votes 2024: ఓట్ల లెక్కింపునకు ఆంధ్రప్రదేశ్‌లో అధికార యంత్రాంగం పక్కాగా సిద్ధమైంది. జూన్ 4న జరగనున్న ఎన్నికల కౌంటింగ్‍కు భారీగా పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. రికార్డుస్థాయిలో రాష్ట్రంలో కేంద్ర బలగాలను మోహరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఏపీ వ్యాప్తంగా పోలీసులు కార్డన్ సెర్చ్ కొనసాగిస్తున్నారు. మరోవైపు అన్ని జిల్లాల్లోనూ కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి.
21 మంది రౌడీషీటర్ల జిల్లా బహిష్కరణ
కడప జిల్లా వ్యాప్తంగా 1038 మంది రౌడీలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నేటి నుంచి 21 మంది రౌడీ షీటర్లపై జిల్లా బహిష్కరణ విధించారు. ఈ సాయంత్రం నుంచి జూన్ 7వ తేదీ వరకు జిల్లాలోకి వీరికి అనుమతి నిరాకరించారు. కౌంటింగ్ రోజు ఘర్షణ జరగకుండా ఉండేందుకు 652 మందిని ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. 131 మంది రౌడీషీటర్లు బయటకు రాకుండా గృహనిర్బంధం విధించారు.
లాడ్జిలు, హోటళ్లు బంద్
ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కడప జిల్లా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బయట వ్యక్తులు జిల్లాలోకి అక్రమంగా ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు. కడప నగరంలో జూన్ 3 నుంచి లాడ్జిలు, ఫంక్షన్ హాళ్లు, హోటల్స్ లో ఎవరూ బసచేయకూడదని, ఓట్ల లెక్కింపు సమయంలో పూర్తిగా మూసేయాలని ఆదేశాలిచ్చారు. జిల్లావ్యాప్తంగా విధించిన 144 సెక్షన్ జూన్ 6 వరకు కొనసాగుతోందని, ప్రజలు సహకరించాలని కోరారు.
Also Read: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం.. ఏపీలో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై బదిలీ వేటు
ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వార్నింగ్
కౌంటింగ్ సమయంలో ఎవరైనా గొడవలకు దిగితే కఠినంగా వ్యవహరిస్తామని కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వార్నింగ్ ఇచ్చారు. పాత నేరస్థులకు, గుర్తు తెలియని బయటి వ్యక్తులకు ఆశ్రయమిచ్చే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లరాదని, ఒకవేళ ఎవరైనా తీసుకెళితే ఫోన్లు సీజ్ చేస్తామని.. మళ్లీ తిరిగి ఇవ్వబోమని స్పష్టం చేశారు. విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు పర్మిషన్ లేదని.. రూల్స్ వయొలేట్ చేస్తే పనిష్మెంట్ తప్పదని వార్నింగ్ ఇచ్చారు.
Also Read: దేశంలో ఏ రాష్ట్రంలో లేని రూల్స్ ఏపీలో అమలు చేస్తున్నారు- ఎన్నికల సంఘంపై పేర్నినాని