Vizag Steel Plant: అలాగైతే బిడ్డింగ్‌లో ఎలా పాల్గొంటారు?: బీఆర్ఎస్ కి ఏపీ మంత్రి అమర్‌నాథ్, సలహాదారు సజ్జల సూటి ప్రశ్న

కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సజ్జల స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయ రగడ కొనసాగుతోంది.

Vizag Steel Plant: అలాగైతే బిడ్డింగ్‌లో ఎలా పాల్గొంటారు?: బీఆర్ఎస్ కి ఏపీ మంత్రి అమర్‌నాథ్, సలహాదారు సజ్జల సూటి ప్రశ్న

Sajjala Ramakrishna Reddy

Updated On : April 11, 2023 / 6:36 PM IST

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయ పరంగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆ ప్లాంట్ నిర్వహణ కోసం మూలధనం, ముడి సరుకులకు మొదట ఫండ్స్ ఇచ్చి ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఉక్కు ఉత్పత్తులను కొనేందుకు యాజమాన్యం ఈవోఐ నిర్వహిస్తుంది. ఈ ప్రతిపాదనల బిడ్డింగ్ లో తెలంగాణ సర్కారు పాల్గొననుండడంతో ఏపీ మంత్రులు దీనిపై స్పందించారు. ఇవాళ ఏపీ మంత్రి అమర్‌నాథ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.

ప్రైవేటీకరణకు అనుకూలమో, వ్యతిరేకమో బీఆర్ఎస్ చెప్పాలని మంత్రి అమర్‌నాథ్ డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రైవేటీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకమైతే మరి బిడ్డింగ్ లో పాల్గొనడం ఏంటని ఆయన నిలదీశారు. అసలు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా బిడ్డింగ్ లో పాల్గొనేందుకు నిబంధనలు ఒప్పుకోవని, ఈ మేరకు గతంలోనే కేంద్ర ప్రకటన చేసిందని వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము కూడా వ్యతిరేకమేనని తెలిపారు.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ… విశాఖ స్టీల్ ప్లాంట్ పై తెలంగాణా ప్రభుత్వం బిడ్డింగ్ లో పాల్గొంటుండడంతో ఏపీలో ప్రతిపక్షాలు జగన్ కు వ్యతిరేకంగా ఏకమై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని చెప్పారు. జగన్ ను ఎదుర్కోలేక విశాఖ స్టీల్ ప్లాంట్ పై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. టీడీపీ ప్రకటనలు చూస్తుంటే పైత్యం ఎక్కువయినట్టుందని ఎద్దేవా చేశారు. కమ్యూనిస్టు పార్టీలూ అలానే ఉన్నాయని చెప్పారు.

“విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది మన సెంటిమెంట్… అంత సీరియస్ నెస్ లేకుండా ప్రధాన పార్టీలు అవివేకంగా మాట్లాడడం కరెక్టేనా?రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు స్పష్టత అనేది అవసరం. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మొదటగా స్పందించింది జగన్మోహన్ రెడ్డే. కేటీఆర్ అదే చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ ప్రాపర్టీ. నష్టాలు వస్తుంటే నడపబోమని మేము చెప్పడం లేదు. కొన్ని సూచనలు చేశాం..అవి అమలు చేయమని కోరుతున్నాం

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేటీఆర్ మాట్లాడడం మంచిదే. ల్యాండ్ ద్వారా వచ్చింది మోడలైజేషన్ చేయడానికి కొంత నష్టాలు పూడ్చడానికి ఉపయోగపడుతుంది. 44 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు సరైన సమాచారం తెలుసుకొని మాట్లాడరా? తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేస్తుందంటే కారణం ఏంటో తెలుసుకోరా? వర్కర్ల బాగోగుల కోసమైతే సీపీఐ, సీపీఎం నేతల యూనియన్లు ఏమయ్యాయి?

విశాఖ స్టీల్ ప్లాంట్ ను అన్ని విధాలా నిలబట్టేందుకు వైసీపీ ముందుంటుంది. చంద్రబాబు ప్రైవేటీకరణ చేయాలనుకున్న ఆర్టీసీని జగన్ ప్రభుత్వంలో విలీనం చేశారు. కమ్యూనిస్టులు సీట్ల కోసం,‌ పొత్తు కోసం చంద్రబాబుకు సపోర్టు చేస్తూ జగన్ పై తప్పుటు మాటలు మాట్లాడుతున్నారు. కేంద్రానికి నచ్చ చెప్పాలని చూస్తున్నాం. ఇతర మార్గాలను కేంద్రానికి చెబుతున్నాం.

అధికారంలోకి వచ్చే ఆశలు లేకే ప్రతిపక్షాలు జగన్ పై తప్పుగా మాట్లాడుతున్నాయి. ప్రజలంతా వీళ్ల నాటకాలు గుర్తించాలి. మా ఎంపీలు కేంద్రాన్ని ప్రైవేటీకరణ చేయవద్దని కోరుతూనే ఉన్నారు. ప్రైవేటీకరణలో ఛాంపియన్ చంద్రబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉంటాం. ముఖ్యమంత్రి, మంత్రులం కలిసి ఎప్పటికప్పుడు కేంద్రానికి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోం” అని సజ్జల వ్యాఖ్యానించారు.

Vizag Steel Plant Privatisation : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణలో కుట్ర ఉంది