Andhra Pradesh : ఏపీ EAPCET షెడ్యూల్ విడుదల.. పరీక్షల తేదీలివే
EAPCET షెడ్యూల్ విడుదలైంది. ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ షెడ్యూల్ ను 2022, మార్చి 23వ తేదీ బుధవారం రిలీజ్ చేశారు...

Ap Eapcet 2022
Andhra Pradesh EAPCET : EAPCET షెడ్యూల్ విడుదలైంది. ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ షెడ్యూల్ ను 2022, మార్చి 23వ తేదీ బుధవారం రిలీజ్ చేశారు. జులై 04వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇంజినీరింగ్ పరీక్షలు, జులై 11, 12వ తేదీల్లో అగ్రికల్చర్, ఎంసెట్ పరీక్ష జరుగుతుందని షెడ్యూల్ లో వెల్లడించారు. ఏపీ వ్యాప్తంగా 136 సెంటర్లలో పరీక్షను నిర్వహించనున్నారు. అవసరం అయితే.. మరిన్నీ పరీక్షా కేంద్రాలు పెంచుతామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనూ 4 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 11న EAPCET నోటిఫికేషన్ వస్తుందని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో కోవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని విద్యార్థులకు ఆయన సూచించారు. సెప్టెంబర్ రెండో వారం నుంచి తరగతులు ప్రారంభమౌతాయని, ఎగ్జామినేషన్ ర్యాంకుల ప్యాట్రన్ లో మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు.
Read More : TS EAMCET: జులై 14 నుంచి తెలంగాణ ఎంసెట్
తెలంగాణలో ఇప్పటికే ఎంసెట్, ఈసెట్ తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎంసెట్ జులై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్ 18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు నిర్వహిస్తారు. ఇలా అయిదు రోజుల పాటు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్షలపై ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి, ఇతర అధికారులతో విద్యా శాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం చర్చలు జరిపి ఎంసెట్, ఈసెట్ తేదీలను ప్రకటించారు. ఎంసెట్‌ను ఇరు రాష్ట్రాల్లో 105 కేంద్రాల్లో జరుపుతామని స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్/బీఫార్మసీ రెండో ఏడాదిలో చేరేందుకు ఈసెట్‌ను జులై 13న జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎంసెట్, ఈసెట్ రిజిస్ట్రేషన్, ఫీజు ఇతర వివరాలతో వారం రోజుల్లో నోటిఫికేషన్లు ఇస్తామని అధికారులు తెలిపారు. బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ ( బీవోక్) విద్యార్థులూ ఈసెట్ ద్వారా బీటెక్ రెండో ఏడాదిలో ప్రవేశానికి అర్హులేనని ఇటీవల ఏఐసీటీఐ తెలియజేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది.