ఏపీలో సిద్ధమవుతోన్న పాపులేషన్‌ మేనేజ్మెంట్ పాలసీ.. వీరికి ఆస్తి పన్ను మినహాయింపు, ఐవీఎఫ్‌ చికిత్స, తల్లులకు వర్క్‌ ఫ్రం హోం.. ఇంకా.. 

ఏపీలో జనాభా పెరుగుదల కోసం సలహాలు స్వీకరించి త్వరలో ఉత్తమ విధానాన్ని తీసుకువస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.

ఏపీలో సిద్ధమవుతోన్న పాపులేషన్‌ మేనేజ్మెంట్ పాలసీ.. వీరికి ఆస్తి పన్ను మినహాయింపు, ఐవీఎఫ్‌ చికిత్స, తల్లులకు వర్క్‌ ఫ్రం హోం.. ఇంకా.. 

Updated On : July 24, 2025 / 12:17 PM IST

జనాభా పెంపునకు ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ సిద్ధమవుతోంది. జనాభా వృద్ధిలో భాగంగా ఈ పాలసీపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నిపుణులు, మేధావుల సూచనలతో ముసాయిదా తయారవుతోంది. ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఉంటే ఆస్తి పన్ను మినహాయింపు వంటి కీలక ప్రతిపాదనలతో ప్రభుత్వం ముసాయిదాను సిద్ధం చేస్తోంది.

ప్రసూతి సెలవులు ఆరు నెలలు నుంచి 12 నెలలు పొడిగింపు, మూడో బిడ్డ ఉంటే అదనంగా రూ.50 వేల ప్రోత్సాహకం, పిల్లలు పుట్టేందుకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం ఆర్థిక సాయం వంటి వాటితో ముసాయిదా సిద్ధమవుతోంది. తల్లులకు వర్క్‌ ఫ్రం హోం సౌకర్యం, పిల్లల సంరక్షణకు శిక్షణ కార్యక్రమాలను స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా చేపట్టడం, ఇందులో శిక్షణ పొందిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో ఉపాధి వంటివి కల్పించడం వంటి ప్రతిపాదనలను కూడా ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ముసాయిదాలో చేర్చుతున్నారు.

Also Read: పార్లమెంటు సమావేశాలు.. 3 రోజుల్లో రూ.23 కోట్లు వృథా

కాగా, జనాభా తగినంతగా ఉంటేనే అన్ని రంగాల్లో దేశాభివృద్ధి జరుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దక్షిణాదిన జనాభా తగ్గిపోతుండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో జనాభా పెరుగుదల కోసం సలహాలు స్వీకరించి త్వరలో ఉత్తమ విధానాన్ని తీసుకువస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ప్రభుత్వ ఆఫీసుల్లోనూ చైల్డ్‌కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీలో ఇటువంటి మరిన్ని అంశాలను తీసుకొచ్చే అవకాశం ఉంది.