Parliament: పార్లమెంటు సమావేశాలు.. 3 రోజుల్లో రూ.23 కోట్లు వృథా

రాజ్యసభలో 816 నిమిషాల వాయిదా వల్ల రూ.10.2 కోట్లు నష్టం జరిగింది. లోక్‌సభ 1,026 నిమిషాలు పనిచేయకపోవడం వల్ల రూ.12.83 కోట్లు నష్టం వచ్చింది.

Parliament: పార్లమెంటు సమావేశాలు.. 3 రోజుల్లో రూ.23 కోట్లు వృథా

Parliament

Updated On : July 24, 2025 / 11:23 AM IST

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ప్రతిరోజు గందరగోళం నెలకొంటోంది. ఈ మూడు రోజుల వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభ కేవలం 54 నిమిషాలు మాత్రమే పనిచేసింది. రాజ్యసభ 4.4 గంటలు మాత్రమే కొనసాగింది. దీంతో మొత్తం రూ.23 కోట్లు ప్రజాధనం వృథా అయినట్లు తెలుస్తోంది.

పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు ప్రతి నిమిషానికి రూ.2.5 లక్షల ఖర్చవుతుందని 2012లో అప్పటి కేంద్ర మంత్రి పవన్ బన్సల్ వెల్లడించారు. లోక్‌సభకు రూ.1.25 లక్షలు, రాజ్యసభకు రూ.1.25 లక్షలు అవుతుందని చెప్పారు.

ఈ ఖర్చులకు సంబంధించిన అప్పటి నుంచి ఇప్పటివరకు మరో ప్రకటన రాలేదు. అప్పట్లో ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం లెక్కేస్తే.. ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో ఇప్పటికే రూ.23 కోట్లు ప్రజాధనం వృథా అయ్యాయి.

ఈ మాన్సూన్ సెషన్‌లో మూడు రోజులు పూర్తయ్యాయి. అంటే ప్రతి సభ 18 గంటలు పనిచేయాలి. రాజ్యసభలో 816 నిమిషాల వాయిదా వల్ల రూ.10.2 కోట్లు నష్టం జరిగింది. లోక్‌సభ 1,026 నిమిషాలు పనిచేయకపోవడం వల్ల రూ.12.83 కోట్లు నష్టం వచ్చింది. మొత్తం మూడు రోజులకుగానూ రూ.23 కోట్లు నష్టం జరిగింది.

సభ పని చేసిన సమయం పని చేయాల్సిన సమయం నష్టం (రూ.కోట్లు)
లోక్‌సభ 54 నిమిషాలు 18 గంటలు 12.83
రాజ్యసభ 4.4 గంటలు 18 గంటలు 10.2

ఉభయ సభల్లో ప్రతిపక్షం, ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. “ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు అంగీకరించిన తరువాత కూడా ప్రతిపక్షం ప్లేకార్డులను ప్రదర్శిస్తూ సమావేశాలు జరగకుండా చేసింది. ఇది ప్రజాధనాన్ని వృథా చేసే చర్యే” అని మండిపడ్డారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతూ.. “బిహార్‌లో 52 లక్షల ఓట్లు తొలగించడమంటే ప్రజాస్వామ్యాన్ని సమూలంగా ఖూనీ చేసే కుట్ర. దీనిపై చర్చకు డిమాండ్ చేస్తున్నాం” అని పేర్కొన్నారు.

పార్లమెంట్ సమావేశాల ప్రస్తుత సెషన్ సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో ఓటర్ల జాబితాల సవరణ, జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై ప్రతిపక్షాలు చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి.