ప్రమాణానికి వేళాయే : ఏపీ మంత్రివర్గ విస్తరణ..డిప్యూటీ సీఎం పోస్ట్ ఎవరికి ?

  • Published By: madhu ,Published On : July 22, 2020 / 11:16 AM IST
ప్రమాణానికి వేళాయే : ఏపీ మంత్రివర్గ విస్తరణ..డిప్యూటీ సీఎం పోస్ట్ ఎవరికి ?

Updated On : July 22, 2020 / 11:51 AM IST

ఏపీ మంత్రివర్గ విస్తరణకు సమయం సమీపిస్తోంది. 2020, జులై 22వ తేదీ బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటా 29 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. దీనికి సంబంధించి ఏపీ రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు.. ఖాళీ అయిన డిప్యూటీ సీఎం పోస్ట్ ఎవరికి దక్కుతుందా అనే ఆసక్తి వైసీపీ నేతల్లో నెలకొంది.

వేణుగోపాలకృష్ణ, అప్పలరాజు :-
వైసీపీ అధిష్టానం పిలుపుతో ఇప్పటికే వేణుగోపాలకృష్ణ, అప్పలరాజు కుటుంబంతో సహా విజయవాడ చేరుకున్నారు. మధ్యాహ్నం వీరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కరోనా కారణంగా నిరాడంబరంగా మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం జరుగుతుంది. మంత్రి పదవులకు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసినప్పటి నుంచి .. కేబినెట్‌ విస్తరణ ఎప్పుడన్నదానిపై విస్తృతంగాచర్చ జరిగింది.

సామాజిక న్యాయం : –  
చివరకు బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటా 29 నిమిషాలకు ముహూర్తాన్ని నిర్ణయించారు. మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం పాటించాలని సీఎం జగన్ భావించారు. దీంతో… రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో అదే సామాజిక వర్గాలకు చెందిన నేతలకు అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. పిల్లి సుభాష్‌ చంద్రబోస్ స్థానంలో శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, మోపిదేవి వెంకట రమణ స్థానంలో మత్స్యకార కుటుంబానికి చెందిన పలాస ఎమ్మెల్యే అప్పలరాజు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.

డిప్యూటీ సీఎం ఎవరో  : –  
మంత్రి పదవులకు ఇద్దరు రాజీనామా చేసినప్పటి నుంచి చాలామంది ఆశావహులు ప్రయత్నాలు చేశారు. కానీ… అదే సామాజిక వర్గం ఎమ్మెల్యేలతో భర్తి చేసే అవకాశం ఉందనే హింట్ రావడంతో.. అంతా సైలెట్ అయిపోయారు. ఇక పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ రాజీనామాతో ఖాళీ అయిన డిప్యూటీ సీఎం పోస్టు ఎవరికి ఇస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.

రెవెన్యూ శాఖ : –  
శంకర్‌ నారాయణ, ధర్మాన కృష్ణదాస్‌లు ఆ పదవికి రేసులో ఉన్నారు. మంత్రులుగా ఇద్దరికి అవకాశం ఇస్తున్నప్పటికీ ప్రస్తుతానికి మిగిలిన వారి శాఖల్లో మార్పు ఉండే అవకాశం కనిపించడం లేదు. అయితే ఈ ఇద్దరూ కొత్తవారు కావడంతో రెవిన్యూ శాఖను మాత్రం వేరే సీనియర్‌కు అప్పగించే అవకాశాలున్నాయని వైసీపీ నేతలంటున్నారు.