AP Cabinet Meeting : AP కేబినెట్ భేటీ.. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేలా తీర్మానం
AP Cabinet Meeting : ఏపీ కేబినెట్ భేటీలో కీలక ప్రతిపాదన చేశారు. అమరావతికి చట్టబద్ధత కల్పించేలా తీర్మానం చేశారు.
ap cabinet meeting to resolution to grant statutory status to amaravati
AP Cabinet Meeting : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సమావేశమైన ఏపీ క్యాబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై మంత్రివర్గ తీర్మానం చేసింది. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్-5ను సవరించాల్సిందిగా మంత్రివర్గం తీర్మానం చేసింది. కొత్త రాజధానిగా సీఆర్డీఏ చట్టం పరిధిలోని అమరావతి పేరును చేర్చాలని తీర్మానం చేసింది. ఈ అంశంపై శనివారం నాడు.. అసెంబ్లీలో 4 గంటల పాటు చర్చ పెట్టి తీర్మానించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా నీరుకొండలో ఎస్ఆర్ఎం వర్సిటీ, 60 మీటర్ల ఎత్తు వరకు అకడమిక్ భవనాల నిర్మాణానికి క్యాబినెట్ అనుమతి ఇచ్చింది.
రాజధాని చరిత్ర ప్రజలకు తెలియజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. పొట్టి శ్రీరాములు పోరాటం, కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, హైదరాబాద్ రాజధానిగా ఏపీ ఆవిర్భావం, తెలంగాణ విభజన, అమరావతి ఏర్పాటు గురించి ప్రజలకు వివరించాలని చంద్రబాబు సూచించారు. అదేవిధంగా.. అమరావతిని రాజధానిగా సమర్థించిన జగన్.. ఆ తర్వాత 3 రాజధానులంటూ చేసిన నాటకాల గురించి జనాలకు తెలియజేయాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. 3 రాజధానుల నాటకంలో నాడు మండలి చైర్మన్‌గా ఉన్న షరీఫ్‌పై దాడి జరిగినంత పనైందని ఈ సందర్భంగా మంత్రులు ప్రస్తావించారు.
ఇదిలా ఉంటే క్యాబినెట్ భేటీ సందర్భంగా.. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జగజ్జీవన్ రామ్ జయంతి రోజు (ఏప్రిల్ 5) మొదలుకుని అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14) లోపు ప్రతి నియోజకవర్గంలో 2 వేల చొప్పున సూర్యఘర్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. పీఎం కుసుమ్ ద్వారా పవర్ లాస్ లు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలను 33/11కేవీ సబ్ స్టేషన్ల వద్ద ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సంస్కరణలు తీసుకొస్తూ విద్యుత్ శాఖ ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.
