Cm Chandrababu : స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్యాకేజీ చరిత్రాత్మక నిర్ణయం- సీఎం చంద్రబాబు
స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు పట్ల సానుకూలంగా స్పందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు.

Cm Chandrababu : విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది చరిత్రాత్మక నిర్ణయం అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు. విశాఖ ఉక్కు అంటే కేవలం పరిశ్రమ మాత్రమే కాదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవం అని అన్నారు. ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయం అన్నారు చంద్రబాబు.
‘విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం 11వేల 440 కోట్ల రూపాయల ప్యాకేజీని అధికారికంగా ప్రకటించడం హర్షణీయం. ఇది చరిత్రాత్మకం. ఈ ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి రోజులకు నాంది పలుకుతుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రానికి గర్వకారణం. స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు పట్ల సానుకూలంగా స్పందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు. ఈ కీలక నిర్ణయానికి సహకరించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు.
విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో విశిష్ట స్థానం ఉంది. విశాఖ ఉక్కు కేవలం పరిశ్రమ మాత్రమే కాదు, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భావోద్వేగ అంశం. ఈ ప్లాంట్ ప్రజల హక్కులు, ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రాష్ట్ర గుర్తింపునకు దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
7 నెలల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం- సీఎం చంద్రబాబు
”విశాఖ స్టీల్ కు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి ప్రధాని మోదీ, నిర్మలా సీతారామాన్, కుమారస్వామిలకు ధన్యవాదాలు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో తెలుగుజాతి సాధించుకున్న పరిశ్రమ ఇది. విశాఖ ఉక్కు పరిశ్రమకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం సమన్వయం చేసుకుని కాపాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు కూడా ఎంతో పట్టుదలతో కష్టపడి చిత్తశుద్ధితో కృషి చేసి రూ.11,440 కోట్లు సాధించాం. విశాఖ ఉక్కును బలమైన సంస్థగా ముందుకు తీసుకెళ్లేందుకు కలసి కట్టుగా కృషి చేస్తాo. సమర్ధుడైన సీఈఓ నియామకం ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం కావాలి.
గడిచిన 7 నెలల్లో అసాధ్యమైన పనులెన్నో సాధించుకుంటూ వస్తున్నాం. అమరావతి ఏకైక రాజధానిగా తేల్చడంతో నిధులు తెచ్చి పునర్ నిర్మాణం చేపట్టాం. పోలవరంకి నిధులు సాధించాం. డయాఫ్రమ్ వాల్ కు శంకుస్థాపన చేస్తున్నాం. విశాఖ రైల్వే జోన్ కు అవసరమైన భూమిని సమీకరించి జోన్ ను సాధించాం. 7 నెలల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. మిట్టల్ పరిశ్రమ, విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా విశాఖ-అనకాపల్లి కలిసి స్టీల్ నగరంగా అవతరిస్తుంది” అని సీఎం చంద్రబాబు అన్నారు.
ఏపీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన కేంద్రం..
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఏపీపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం తమ నిర్ణయాన్ని అమలు చేసిందని చెప్పొచ్చు. గత 6 నెలల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు.. అనేకసార్లు స్టీల్ ప్లాంట్ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. స్టీల్ ప్లాంట్ చారిత్రక నేపథ్యాన్ని, ఏ విధంగా ఏర్పడింది, ఎంత మంది అసువులు బాసారు, ఏ విధంగా ఏపీ ప్రజలకు స్టీల్ ప్లాంట్ తో సెంటిమెంట్ ముడిపడి ఉందనే అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
స్వయంగా స్టీల్ ప్లాంట్ ను పరిశీలించిన కేంద్ర మంత్రి కుమారస్వామి..
అటు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి స్వయంగా వచ్చి ఉక్కు పరిశ్రమను పరిశీలించిన సంగతి తెలిసిందే. ఆయన కూడా చాలా పాజిటివ్ గా కేంద్రానికి నివేదిక ఇచ్చారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఉన్న ఎన్డీయే సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ ఉక్కు పరిశ్రమకు భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం సహకారం మరువలేనిదని చంద్రబాబు కొనియాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తులు చేశారు.
Also Read : పేదలకు ఇళ్ల స్థలాలు, వచ్చే ఏడాది నుంచి తల్లికి వందనం అమలు.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..