వరలక్ష్మి కుటుంబానికి సీఎం జగన్ రూ.10 లక్షల సాయం

విశాఖ జిల్లా గాజువాక శ్రీనగర్ సుందరయ్య కాలనీలో యువతిపై అఖిల్ అనే యువకుడు కత్తితో దాడి చేయగా.. వరలక్ష్మి అనే అమ్మాయి చనిపోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు.
ఈ ఘటనపై సీరియస్ అయిన జగన్.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరి, బాధిత కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
మహిళల భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలని డీజీపీ, సీఎస్‌లకు సూచనలు చేశారు జగన్. విద్యార్థినులందరూ దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకునేవిధంగా అవగాహన కల్పించాలని కోరారు. ఈ ఘటనపై సీఎస్, డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్ నుంచి వివరాలు తీసుకున్న సీఎం జగన్.. వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించాలని హోం మంత్రి మేకతోటి సుచరిత, దిశ ప్రత్యేక అధికారులు కృతికాశుక్లా, దీపికా పాటిల్‌ను ఆదేశించారు.
పాఠశాలల్లో చదువుతున్న బాలికలు మొదలు కాలేజీ విద్యార్థినుల వందకు వంద శాతం దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాలను అదుపు చేసే విధంగా పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.