రేపు ఢిల్లీకి వెళ్ళనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు మంగళవారం, జూన్ 2వతేదీ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన హోం మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించన పలు అంశాలపై అయన అమిత్ షాతో చర్చించనున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఏర్పడిన రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని వివరించనున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావల్సిన నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు.
అమిత్ షాతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులను కూడా కలిసి రాష్ట్ర ప్రయోజనాలపైనా, కేంద్ర వద్ద పెండింగ్ లో ఉన్న రాష్ట్ర వ్యవహారాలను ఢిల్లీ పెద్దలతో సీఎం చర్చించనున్నారు. కరోనా లాక్ డౌన్ వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సీఎంజగన్ మోహన్ రెడ్డి ఒక లేఖ రాశారు. కరోనా లాక్ డౌన్ పరిస్ధితుల తర్వాత తొలిసారిగా సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్లనుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణమాలతో పాటు,మండలి రద్దు, స్టేట్ ఎలక్షన్ కమీషనర్ వ్యవహారంలో హైకోర్టు తీర్పు, వంటి అంశాలను కూడా ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి లోని నివాసం నుంచి బయలుదేరే సీఎం, మధ్యాహ్నం 1 గంటకుఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేసి బుధవారం ఉదయం తిరిగి ఏపీకి రానున్నారు.