అటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇటు హోంమంత్రి అనిత.. ఆసక్తికరంగా డీజీపీ వరుస మీటింగ్స్..

ముఖ్యంగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల నియంత్రణపైన సమీక్షిస్తున్నారు.

అటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇటు హోంమంత్రి అనిత.. ఆసక్తికరంగా డీజీపీ వరుస మీటింగ్స్..

Updated On : November 9, 2024 / 5:57 PM IST

DGP Dwaraka Tirumala Rao : ఏపీలో వరుస సంఘటనలు, డీజీపీ ద్వారకా తిరుమలరావు వరుస భేటీలు ఆసక్తికరంగా మారాయి. ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు డీజీపీ. రాష్ట్రంలో శాంతిభద్రతలు, సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తుల అరెస్ట్ లపైన చర్చించారు. ఆ వెంటనే హోంమంత్రి అనితను కలిశారు డీజీపీ. హోంమంత్రితో కలిసి ఎస్పీలతో వర్చువల్ మీటింగ్ జరిపారు. ఏపీలో శాంతి భద్రతలు, మహిళలు, చిన్నారుల భద్రత, గంజాయి నిర్మూలనపై చర్చించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల నియంత్రణపైన సమీక్షిస్తున్నారు.

గత కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కలవడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలపై పూర్తి స్థాయిలో పవన్ కు వివరించారు డీజీపీ. గత కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు, మహిళలు చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు.. ఇంత జరుగుతున్న పోలీసులు స్పందించడం లేదంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ఈ అంశంపై చర్చ జరిగింది. అనంతరం ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ ను డీజీపీ ద్వారకా తిరుమలరావు కలవడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దూషణలు, పోస్టులకు సంబంధించిన వ్యవహారంలో రాష్ట్రంలో ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిపైన చర్యలు తీసుకున్నారు, ఇంకా ఎంతమందిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.. అనే అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పవన్ కల్యాణ్ కు డీజీపీ వివరించినట్లు సమాచారం.

పవన్ కల్యాణ్ తో భేటీ తర్వాత.. హోంమంత్రి అనితను కూడా కలిశారు డీజీపీ. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా, నార్కోటిక్ ఐజీలను కలిశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై ఎస్పీలను అప్రమత్తం చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారికి వివరించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు.

* అమరావతిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో డీజీపీ ద్వారకా తిరుమల రావు భేటీ
* మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో సమావేశం
* రాష్ట్రంలో శాంతిభద్రతలు, సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్ పై చర్చ

* ఏపీలో శాంతిభద్రతలపై హోంమంత్రి అనిత సమీక్ష
* మహిళలు, చిన్నారుల భద్రత.. గంజాయి నిర్మూలనపై పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశం
* సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల నియంత్రణపై చర్చ

Also Read : ఏపీలో నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుదల.. నైతిక విలువ‌ల స‌ల‌హాదారుగా చాగంటి..