వైసీపీలో టికెట్ల రచ్చ.. గుంటూరు, నరసరావుపేట విషయంలో ఎడతెగని పంచాయితీ

ఇప్పటికే గుంటూరు టికెట్ ఇవ్వకపోవడంతో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేశారు.

వైసీపీలో టికెట్ల రచ్చ.. గుంటూరు, నరసరావుపేట విషయంలో ఎడతెగని పంచాయితీ

Guntur And Narasaraopeta Tickets Issue In YCP

Updated On : January 6, 2024 / 6:37 PM IST

YCP : వైసీపీలో గుంటూరు, నరసరావుపేట ఎంపీ స్థానాల పంచాయితీ కొనసాగుతోంది. గుంటూరు నుంచి లావు శ్రీ కృష్ణ దేవరాయలను బరిలో నిలపాలని వైసీపీ యోచిస్తోంది. ఇప్పటికే పోటీపై ఆయనకు సమాచారం ఇచ్చారు. నరసరావుపేట నుంచి మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని బరిలో దింపాలని భావిస్తున్నారు. అయితే గుంటూరు నుంచి పోటీ చేసేందుకు శ్రీకృష్ణ దేవరాయలు ఆసక్తి చూపడం లేదు. నరసరావుపేట నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు టికెట్ ఇవ్వకపోవడంతో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేశారు.

వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా..
గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ స్థానాలకు సంబంధించి వైసీపీలో పెద్ద పంచాయితీనే నడుస్తోంది. గుంటూరు ఎంపీ స్థానానికి గట్టి పోటీ ఉంది. ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరారు. గుంటూరు టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. అయితే, గుంటూరు టికెట్ ఇవ్వడం కుదరదని వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పింది.

Also Read : వైసీపీకి షాక్.. పొలిటికల్ ఇన్నింగ్స్‌కి అంబటి రాయుడు బ్రేక్

గుంటూరు వద్దు నరసరావుపేటే ముద్దు..
ప్రస్తుతం నరసరావుపేట సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు నుంచి పోటీ చేయించే యోచనలో వైసీపీ అధిష్టానం ఉంది. ఈ విషయాన్ని ఆయనకు సమాచారం ఇచ్చేశారు. నిన్న సీఎం జగన్ నేరుగా దేవరాయలకు ఈ విషయం చెప్పారు. అయితే, లావు శ్రీ కృష్ణ దేవరాయలు మాత్రం గుంటూరు నుంచి పోటీ చేసేందుకు తాను ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. పోటీ అంటూ చేస్తే నరసరావుపేట నుంచే చేస్తాను లేదంటూ పోటీకి పూర్తిగా దూరంగా ఉంటాను అని తన సన్నిహితుల వద్ద కృష్ణదేవరాయలు చెబుతున్నట్లు సమాచారం.

కచ్చితంగా గెలుస్తానంటున్న శ్రీకృష్ణదేవరాయలు..
గత ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన, నరసరావు పేట ఎంపీగా పని చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని.. ఈసారి ఎన్నికల్లో నరసరావుపేట నుంచి బరిలోకి దింపాలని వైసీపీ అధినాయకత్వం ఆలోచన చేసింది. దీనికి సంబంధించి ప్రయత్నాలు కూడా చేసింది. దీనిపై రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న అయోధ్య రామిరెడ్డి మాట్లాడినట్లు సమాచారం. గుంటూరు, నరసరావుపేట.. ఈ రెండు లోక్ సభ స్థానాలకు సంబంధించి పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో నరసరావు పేట నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచిన శ్రీకృష్ణదేవరాయలు.. ఈసారి కూడా నరసరావుపేట నుంచే పోటీ చేస్తాను, కచ్చితంగా గెలుస్తాను అని లావు శ్రీకృష్ణదేవరాయలు చెబుతున్న పరిస్థితి ఉంది. గుంటూరు నుంచి పోటీ చేయడం తనకు ఇష్టం లేదంటున్నారాయన.

నరసరావుపేట నుంచి బరిలోకి మోదుగుల..
గత ఎన్నికల్లో గుంటూరు ఎంపీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. గుంటూరు వైసీపీ ఇంఛార్జిగా మొన్నటివరకు మోదుగుల వేణుగోపాల్ ఉన్నారు. అయితే, గుంటూరు నుంచి వేణుగోపాల్ ని నరసరావుపేటకు పంపిస్తున్నారు కాబట్టి గుంటూరు స్థానం ఖాళీ అవుతుంది. దీంతో గుంటూరుకి శ్రీకృష్ణదేవరాయలను తీసుకురావాలని వైసీపీ యోచిస్తోంది. కానీ, లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం గుంటూరుకి వెళ్లడం తనకు ఇష్టం లేదని ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి మరోసారి లావు శ్రీకృష్ణదేవరాయలుతో మాట్లాడే అవకాశం ఉంది.

Also Read : రసవత్తరంగా చంద్రగిరి రాజకీయం.. చెవిరెడ్డి ఫ్యామిలీని ఢీకొట్టేందుకు సై అంటున్న డాలర్స్ దివాకర్ రెడ్డి

రెండూ కైవసం చేసుకోవాలని వైసీపీ టార్గెట్..
గుంటూరు, నరసరావుపేట.. ఈ రెండు లోక్ సభ స్థానాలను ఖాతాలో వేసుకోవాలని వైసీపీ పట్టుదలగా ఉంది. అయితే, గుంటూరు లోక్ సభ స్థానానికి సంబంధించి ప్రస్తుతం చిక్కుముడి వీడటం లేదు. గుంటూరు పార్లమెంటుకు శ్రీకృష్ణదేవరాయలు వస్తారా? లేక కొత్త వ్యక్తి తెరపైకి వస్తారా? అన్నది తేలాల్సి ఉంది. గుంటూరు, నరసరావుపేట స్థానాలకు సంబంధించి పంచాయితీపై సోమవారం ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని వైసీపీ నేతలు అంటున్నారు.