మందుబాబులకు జగన్ సర్కార్ షాక్: ఏపీలో లిక్కర్ షాపులు బంద్

  • Published By: vamsi ,Published On : March 10, 2020 / 02:05 PM IST
మందుబాబులకు జగన్ సర్కార్ షాక్: ఏపీలో లిక్కర్ షాపులు బంద్

Updated On : March 10, 2020 / 2:05 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపులు ప్రభుత్వమే నిర్ణయిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే మద్యం, డబ్బు ప్రలోభాలు లేకుండా చూడాలని చెబుతున్న సీఎం జగన్.. ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. మందు బాబులకు మద్యం అందకుండా లిక్కర్ షాపులను బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 18 రోజుల పాటు మద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు మంత్రి అనిల్ కుమార్ ఇప్పటికే వెల్లడించారు. ఈనెల 12 నుంచి 29 వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు స్పష్టం చేశారు. మద్యపాన నిషేధ సంస్కరణలు అమల్లో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులను ఇప్పటికే తగ్గించిన ప్రభుత్వం.. లిక్కర్ అమ్మకాల వేళల్లోనూ మార్పులు చేసింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు మాత్రమే మద్యం అమ్మకాలు జరపుతుంది. అయితే ఇప్పుడు ఎన్నికల సంధర్భంగా 18 రోజుల పాటు లిక్కర్ సేల్స్ బంద్ చేయాలని నిర్ణయించింది.

మాములుగా అయితే ఎన్నికల సమయంలో రెండ్రోజుల పాటు, ఫలితాల రోజు మద్యం షాపులు నిలిపేస్తుంటారు. కానీ, ఇన్ని రోజులు మద్యం షాపులను మూసివెయ్యడం ఇదే తొలిసారి. ఎన్నికల్లో ఓటర్లపై డబ్బు, మద్యం ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతుంది. మార్చి 21 నుంచి స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. 21న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు, 23న మున్సిపల్‌, నగర పంచాయతీ, కార్పొరేషన్లకు ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఈ నెల 27, 29 తేదీల్లో రెండు దశల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.