మీకు రేషన్ కార్డు లేదా..నో ప్రాబ్లం..ఐదు రోజుల్లో వచ్చేస్తుంది!

మీకు రేషన్ కార్డు లేదా..నో ప్రాబ్లం..దరఖాస్తు చేసుకోండి..ఐదు రోజుల్లో వచ్చేస్తుంది..అంటోంది ఏపీ ప్రభుత్వం. ఎందుకంటే కరోనా రాకాసి వల్ల ఏ ఒక్క పేద కుటుంబం పస్తులు ఉండదనే సంకల్పంతో చర్యలు తీసుకొంటోంది. అందులో ప్రధానమైంది రేషన్. ప్రతొక్కరికీ రేషన్ సరుకులు అందివ్వాలని సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
రేషన్ షాపుకు వచ్చిన పేద (అర్హులైన) వారికి కంపల్సరీగా బియ్యాన్ని అందివ్వాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. వీలుంటే..దరఖాస్తు అందచేసి..ఐదు రోజుల్లో వారికి రేషన్ కార్డు అందచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో కరోనా రాకాసి విస్తరిస్తోంది. దీని కారణంగా ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రధానంగా కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రేషన్ సరుకుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
రేషన్ బియ్యంతో పాటు రూ. 1000 నగదు అందచేస్తున్నామన్నారు. 2020, ఏప్రిల్ 15వ తేదీ బుధవారం నుంచి రెండో విడత రేషన్ పంపిణీ చేస్తున్నట్లు, దీనికి అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. రేషన్ కార్డు దరఖాస్తు చేసుకుంటే..జారీ చేయడానికి కొన్ని రోజుల సమయం పడుతుందని, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఐదు రోజుల్లోనే కార్డు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
దరఖాస్తులు అన్నీ పరిశీలించిన తర్వాత…రేషన్ కార్డు పొందడానికి అర్హులయితే.. వారి వారి ఫోన్ నెంబర్లకు మెసేజ్ వెళుతుందన్నారు. అనంతరం స్లిప్పులు తీసుకెళ్లి రేషన్ తీసుకోవచ్చన్నారు.