గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు మరో కీలక బాధ్యత.. ఈసారి ఇంటింటి సర్వే!

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో జులై నెలకు సంబంధించిన పెన్షన్లు లబ్ధిదారులకు ప్రభుత్వం పంపిణీ చేయించింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రతీనెలా ..

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు మరో కీలక బాధ్యత.. ఈసారి ఇంటింటి సర్వే!

CM Chandrababu Naidu

Village and Ward Secretariats : గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో జులై నెలకు సంబంధించిన పెన్షన్లు లబ్ధిదారులకు ప్రభుత్వం పంపిణీ చేయించింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రతీనెలా 1వ తేదీన గ్రామ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. అయితే, నూతనంగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం వాలంటీర్లతో సంబంధం లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో ఇంటింటికి పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. జూలై 1వ తేదీ ఉదయం 6గంటల నుంచి రాత్రి వరకు గ్రామాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. దీంతో వాలంటీర్ల ప్రమేయం లేకుండా ఒక్కరోజులోనే రాష్ట్రంలోని 90శాతం మంది లబ్ధిదారులకు పెన్షన్లను ప్రభుత్వం అందించింది. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విజయవంతంగా నిర్వహించడంతో ప్రభుత్వం వీరికి మరో కీలక బాధ్యతను అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Also Read : ఆ కేసులు రీఓపెన్..! వైసీపీ కీలక నేతలే టార్గెట్‌గా ఉచ్చు బిగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం

రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులకు ఆయా రంగాల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం స్కిల్ సెన్సెస్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో స్కిల్ సెన్సెస్ కార్యక్రమం అమలుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ స్కిల్ సెన్సెస్ లో వివిధ శాఖలను భాగస్వామ్యం చేసే విధివిధానాలపై మంత్రి నారా లోకేశ్ అధికారులతో మంగళవారం చర్చించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటి సర్వే చేపట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Also Read : కనీసం ముఖం కూడా చూపెట్టలేదు, సీఎం రేవంత్ రెడ్డిని లైట్‌ తీసుకున్న ఎమ్మెల్యే..! ఎందుకీ ధిక్కార స్వరం?

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్కిల్ సెన్సెస్ ప్రోగ్రాం ద్వారా స్వదేశం, విదేశాల్లో డిమాండ్ ఉన్న కోర్సులలో యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. తద్వారా నైపుణ్యాభివృద్ధిలో యువతకు ఉపాధి కల్పనకు పెద్దపీట వేయనున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో చదువుకున్న యువత ఎంత మంది ఉన్నారు. వారు ఏఏ రంగాల్లో శిక్షణ పొందేందుకు సిద్ధంగా ఉన్నారనే విషయాలతోపాటు పలు విషయాలపై ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాల్సి ఉంటుంది. ఆ వివరాల సేకరణ బాధ్యతను గ్రామ, సచివాలయ వాలంటీర్లకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తుంది.