మహిళలకు జగన్ ప్రభుత్వం మరో శుభవార్త

  • Published By: naveen ,Published On : July 18, 2020 / 10:13 AM IST
మహిళలకు జగన్ ప్రభుత్వం మరో శుభవార్త

Updated On : July 18, 2020 / 1:41 PM IST

ఏపీలో మహిళలకు జగన్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. వైఎస్‌ఆర్‌ చేయూత పథకానికి దరఖాస్తు చేసేందుకు గడువు పెంచింది. మరో ఐదు రోజులు గడువు ఇచ్చింది. పెన్షన్ దారులకూ చేయూత పథకంలో సాయం అందిస్తామని సీఎం జగన్ ప్రకటించడంతో దరఖాస్తు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అర్హత ఉండి ఇప్పటివరకు ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.75వేలు:
మహిళల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు వారిని వైఎస్ఆర్ చేయూత ద్వారా ఆదుకుంటామని ఎన్నికల ప్రచార సమయంలో జగన్ హామీ ఇచ్చారు. ఈ పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలందరికీ ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం అందించనున్నారు. ఇప్పటికే లబ్ధిదారులు జూన్‌ 28 నుంచి దరఖాస్తులు ఇచ్చారు.

ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటున్న మహిళలూ అర్హులే:
ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటున్న మహిళలకు కూడా జగన్ అవకాశం కల్పించారు. ఆర్థికంగా భారమైనప్పటికీ వారికి కూడా చేయూత కింద ప్రయోజనాలను అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు వారినీ పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. ఈ నిర్ణయంతో పెన్షన్‌ కానుక అందుకుంటున్న వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులైన మహిళలు, చేనేతలు, గీత, మత్స్యకార మహిళలకూ లబ్ది చేకూరనుంది. 8.21 లక్షల మందికిపైగా మహిళలకు ఈ పథకం అందనుంది. మహిళల జీవణ ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న వైఎస్ఆర్ చేయూత పథకాన్ని మరింత విస్తరించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ పథకం కోసం ఏడాదికి రూ.1,540 కోట్లకు పైగా, నాలుగేళ్లలో రూ.6,163 కోట్ల మేర ప్రభుత్వం అదనంగా ఖర్చు చేయనుంది.