AP High Court: క్రైస్తవ మతంలోకి మారినరోజే ఎస్సీ హోదా కోల్పోతారు.. ఆ చట్టం నుంచికూడా రక్షణ పొందలేరు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. షెడ్యూల్ కులాల (ఎస్సీ) వ్యక్తులు క్రైస్తవ మతంలోకి మారిన రోజునుంచే ఎస్సీ హోదాను కోల్పోతారని..

AP High Court: క్రైస్తవ మతంలోకి మారినరోజే ఎస్సీ హోదా కోల్పోతారు.. ఆ చట్టం నుంచికూడా రక్షణ పొందలేరు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

AP High Court

Updated On : May 2, 2025 / 7:59 AM IST

AP High Court: ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. షెడ్యూల్ కులాల (ఎస్సీ) వ్యక్తులు క్రైస్తవ మతంలోకి మారిన రోజునుంచే ఎస్సీ హోదాను కోల్పోతారని, అంతేకాక ఎస్సీ, ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఎన్. హరినాథ్ ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

Also Read: IPL 2025: అయ్యో వైభవ్.. కాస్త ఓపిక పట్టాల్సింది.. రాహుల్ ద్రవిడ్ రియాక్షన్ వైరల్.. రోహిత్ శర్మ ఏం చేశాడంటే..

తనను కులం పేరుతో దూషించి, దాడిచేసి గాయపర్చాడని ఉమ్మడి గుంటూరు జిల్లా కొత్తపాలెం గ్రామానికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ 2021లో చందోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పలువురిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు గుంటూరు ఎస్సీ, ఎస్టీ కోర్టులో పెండింగ్ లో ఉండగా.. కేసును కొట్టేయాలంటూ నిందితులు 2022లో హైకోర్టులో పిటిషన్ వేశారు.

 

‘‘ఫిర్యాదుదారు పదేళ్లుగా పాస్టర్ గా పనిచేస్తున్నారు. క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదు. రాజ్యాంగం (షెడ్యూల్ కులాలు) ఆర్డర్-1950 ప్రకారం హిందూమతాన్ని కాకుండా ఇతర మతాలను స్వీకరించినవారు ఎస్సీ హోదాను కోల్పోతారు. కుల వ్యవస్థను క్రైస్తవం గుర్తించదు. ఆ మతాన్ని స్వీకరించిన వారికి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ ఉండదని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది.. వీటిని పరిగణలోకి తీసుకొని తమపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ’’ బాధితులు హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్ లో కోరారు.

 

ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. హరినాథ్ తీర్పును వెల్లడిస్తూ.. ‘ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఫిర్యాదుదారుడు రక్షణ పొందలేరు. నిందితులపై ఐపీసీ కింద నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావు’’ అని తీర్పులో పేర్కొన్నారు. పోలీసులు ఛార్జిషీట్ వేయకుండా ఉండాల్సిందని కోర్టు అభిప్రాయపడింది. కేసును కోర్టు కొట్టివేసింది.