కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ఆశలు నెరవేరేనా

  • Published By: madhu ,Published On : February 1, 2020 / 12:50 AM IST
కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ఆశలు నెరవేరేనా

Updated On : February 1, 2020 / 12:50 AM IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర పద్దులపై ఏపీ ప్రభుత్వం కోటి ఆశలు పెట్టుకుంది. గత ఐదేళ్లలో రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగలేదు. నరేంద్రమోదీ సర్కార్ రెండోసారి అధికారం చేపట్టడం, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడడంతో… ఈసారైనా రాష్ట్రానికి న్యాయం జరక్కపోతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. జగన్ ప్రభుత్వాన్ని ఏర్పరిచాక నరేంద్ర మోదీతో సత్సంబంధాలు కొంత మెరుగయ్యాయని చెప్పుకోవచ్చు. మోదీ కూడా జగన్‌కు సానుకూలంగానే ఉన్నట్లు కనబడుతోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై ప్రభుత్వం, ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. 

కేంద్ర బడ్జెట్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు. ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం ఎప్పుడో చుట్ట చుట్టి అటక్కెక్కించేసింది. దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ అన్న అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చింది. అలాగని ప్రత్యేక ప్యాకేజీ కూడా రాష్ట్రానికి అందలేదు. గడచిన ఐదేళ్లలో కేంద్రం రాజధాని నిర్మాణానికి కేవలం రూ. 15 వందల కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది.

మరోవైపు పరిపాలనా రాజధానిగా విశాఖను చేసేందుకు జగన్ సర్కార్ అడుగులు ముందుకు వేస్తోంది. దీంతో రాజధాని నిర్మాణానికి నిధులపై కొంత సందిగ్ధం ఏర్పడింది. ఇక జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరానికి కూడా కేంద్రం అనుకున్న స్థాయిలో నిధులు విడుదల చేయలేదు. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి రాష్ట్రం ఖర్చు చేసిన 11 వేల 860 కోట్ల రూపాయలలో కేంద్రం నుండి 3 వేల 283  కోట్ల రూపాయలు రావాల్సి వుంది. ప్రాజక్ట్‌కు ఇంకా 24 వేల 489 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. 

దుగరాజపట్నం పోర్టుకు వాణిజ్య యోగ్యత లేదని కేంద్రం స్పష్టం చేసింది. అందుకు ప్రతిగా రామాయపట్నం పోర్టుకు ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. విభజన చట్టం ప్రకారం కడప స్టీల్ ఫ్యాక్టరీని కేంద్రం నిర్మించాలి. కేంద్రం చేతులు ఎత్తేయడంతో.. ఫ్యాక్టరీ నిర్మాణ బాధ్యతలను ఏపీ ప్రభుత్వమే భుజాన వేసుకుంది. ఎన్నికల హామీగా ఇచ్చిన మాటను జగన్ సర్కార్ నిలుపుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ప్రయోజిత పథకాల ద్వారా రావాల్సిన దాదాపు 6 వేల కోట్ల రూపాయలు కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. అలాగే ఈసారి రైల్వే బడ్జెల్‌లో విశాఖ మెట్రో రైలుకు నిధులు కేటాయించాలని పట్టుబడుతోంది. 

కేంద్ర బడ్జెట్‌లో దక్షిణాదికి ప్రతీసారి అన్యాయమే జరుగుతోందన్న భావన ఇక్కడి రాష్ట్రాల్లో ఉంది. ఇది ఎప్పుడూ జరిగే తతంగమే అయినప్పటికీ బడ్జెట్ కేటాయింపుల్లో వరుసగా అన్యాయానికి గురవుతున్న ఏపీని.. ఈ సారి ఎలాగైనా కేంద్రం పెద్ద మనసుతో ఆదుకోవాలని ఆంధ్రా ప్రజలు కోరుకుంటున్నారు.  

 

* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయం తక్కువ, అప్పులు ఎక్కువ. 
* రాష్ట్ర విభజన దెబ్బ నుండి ఐదేళ్లు దాటినా ఏపీ కోలుకోలేదు. నరేంద్రమోదీతో కలిసి చంద్రబాబు ఎన్నికల్లో పోటీ చేసి

* గెలవడంతో.. ఏపీ అభివృద్ధి చెందుతుందని అనుకున్నారు. 
* కేంద్రం నుండి సరైన సాయం లేకపోవడంతో గడచిన ఐదేళ్లు రాష్ట్రం బాగా నష్టపోయింది. 
* చివరి బడ్జెట్‌లో కూడా కేంద్రం న్యాయం చేయలేదని చంద్రబాబు ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్నారు. 

Read More : ప్రధాన మంత్రి మోడీకి సీఎం జగన్ లేఖ