మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అప్డేట్.. ప్రాథమిక ‘కీ’ వచ్చేసింది.. అభ్యంతరాలుంటే ఆ తేదీలోపు తెలపొచ్చు.. అందుబాటులోకి తెచ్చిన కీలు ఇవే..

ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో వివిధ సబ్జెక్టుల ప్రాథమిక ‘కీ’లను అధికారులు విడుదల చేశారు.

మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అప్డేట్.. ప్రాథమిక ‘కీ’ వచ్చేసింది.. అభ్యంతరాలుంటే ఆ తేదీలోపు తెలపొచ్చు.. అందుబాటులోకి తెచ్చిన కీలు ఇవే..

AP Mega DSc

Updated On : July 4, 2025 / 10:44 AM IST

AP Mega DSc: ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో వివిధ సబ్జెక్టుల ప్రాథమిక ‘కీ’లను అధికారులు విడుదల చేశారు. వీటితోపాటు రెస్సాన్స్ షీట్ లను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ప్రాథమిక ‘కీ’ల పట్ల అభ్యంతరాలు ఉంటే.. అభ్యర్థులు తగిన ఆధారాలతో జులై 11వ తేదీలోగా సమర్పించాలని సూచించారు. జూన్ 29 నుంచి జులై 2వ తేదీ వరకు జరిగిన పరీక్షల ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను త్వరలోనే విడుదల చేయనున్నట్లు చెప్పారు.

మెగా డీఎస్సీలో భాగంగా ఏపీలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో 16,347టీచర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం జూన్ 6వ తేదీ నుంచి జులై 2వ తేదీ వరకు మొత్తంగా 23రోజుల పాటు రెండు సెషన్లలో పరీక్షలు ముగిశాయి. ఈ పరీక్షలకు మొత్తం 92.90శాతం మంది హాజరైయ్యారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో ప్రకటించిన ప్రకారం.. ఏపీ డీఎస్సీ ఫలితాలు ఆగస్టు రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలు దఫాలుగా ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను విద్యాశాఖ అధికారులు విడుదల చేస్తున్నారు.

తాజాగా.. పీజీటీ విభాగంలో కామర్స్‌, ఇంగ్లిష్‌, హిందీ, ఫిజిక్స్‌, సంస్కృతం, సోషల్‌, తెలుగు. స్కూల్‌ అసిస్టెంట్‌ విభాగంలో ఇంగ్లిష్‌, ఫిజికల్ సైన్స్. ఎస్జీటీ విభాగంలో జనరల్‌, స్పెషల్‌ హెచ్‌హెచ్‌, వీహెచ్‌. టీజీటీ విభాగంలో ఇంగ్లిష్‌, హిందీ, ఫిజిక్స్‌, సైన్స్‌(విజ్ఞాన శాస్త్రం), సోషల్‌, తెలుగు. ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌, పీఈటీ పరీక్షల ప్రాథమిక ‘కీ’ విడుదల చేసినట్లు డీఎస్సీ కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

మంత్రి నారా లోకేశ్ ఏమన్నారంటే..
మెగా డీఎస్సీ ప్రాథమిక కీ విడుదల చేసిన సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఏడు సంవత్సరాల తరువాత మెగా డీఎస్సీ-2025ను 23 రోజుల్లో సజావుగా నిర్వహించాం. 3.36లక్షల మంది అభ్యర్థులు 5.77లక్షల దరఖాస్తులు సమర్పించారు. 92.9శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. కోర్టు కేసులతో డీఎస్సీని అడ్డుకునేందుకు వైసీపీ కుట్ర చేసింది. 31 కేసులు వేసినప్పటికీ.. పరీక్షలు నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరిగాయి. ఎస్సీ ఉప వర్గీకరణ, 3శాతం స్పోర్ట్స్ కోటా వంటి నిబంధనలు పాటించాము. మెగా డీఎస్సీకి సంబంధించిన ప్రాథమిక ‘కీ’ విడుదల చేశాం. అభ్యర్ధనలు పరిశీలించాక తుది ‘కీ’ విడుదల చేస్తాం. మెగా డీఎస్సీని సమర్ధవంతంగా నిర్వహించిన ప్రతి జిల్లా, రాష్ట్ర అధికారులకు అభినందనలు తెలుపుతున్నానని లోకేశ్ పేర్కొన్నారు.