గుళ్ల విధ్వంస రగడకు జగన్ ప్రభుత్వం కౌంటర్ : కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి రెడీ

the temples demolished during the Pushkars will be rebuilt : ఏపీలో గుళ్ల విధ్వంసం రగడకు జగన్ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి రెడీ అవుతోంది. పుష్కరాల సమయంలో కూల్చిన ఆలయాలను తిరిగి నిర్మిస్తామని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. రూ.70 కోట్లతో దుర్గగుడి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 8న ఉదయం 11.01 గంటలకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 40 ఆలయాల పునర్నిర్మాణానికి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. సీఐడీ విచారణలో రామతీర్థం ఘటనలో నిజాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.
విజయనగరం జిల్లా రామతీర్థంలోని ప్రఖ్యాత శ్రీరాముని ఆలయంలో విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం నుంచి తల భాగాన్ని వేరు చేసి కొండపైన ఉన్న కోనేరులో పడేశారు. విగ్రహం తల కోసం పోలీసులు, ఆలయ అధికారులు విస్తృతంగా గాలించగా కోనేరులో లభ్యమయింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ తరుణంలో టీడీపీ, వైసీసీ, బీజేపీ నేతలు పోటాపోటీగా పర్యటనకు వస్తుండడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం దేవాలయాల చుట్టే తిరుగుతున్నా యి. వరుసగా చోటుచేసుకుంటున్న దేవతా విగ్రహాల ధ్వంసం ఘటనలు రాజకీయరంగు పులుముకున్నాయి. అన్ని రాజకీయపార్టీలు విగ్రహాలపై దాడుల వ్యవహారం నుంచి రాజకీయంగా మైలేజీ పొందాలని ప్రయత్నిస్తున్నాయి. ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు వైసీపీపై విమర్శలు ఎక్కుపెట్టారు.
సీఎం జగన్ లక్ష్యంగా టీడీపీ ఆరోపణలు చేస్తున్నది. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకే రామతీర్థం, పైడితల్లి, మండపల్లి ధర్మకర్తగా ఉన్న అశోక గజపతిరాజుని తొలగించారని విమర్శిస్తున్నది. టీడీపీ, వైసీపీ, బీజేపీ నేతలు పోటాపోటీగా రామతీర్థం సందర్శనకు వెళ్లారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకేరోజు రామతీర్థం పర్యటనకు వెళ్లడంతో ఇరుపార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.