ఏపీలో పంచాయతీ యాప్ లొల్లి

ఏపీలో పంచాయతీ యాప్ లొల్లి

Updated On : February 4, 2021 / 6:55 AM IST

AP Panchayat Elections AAP : కాదేది వివాదానికి అనర్హం అన్నట్లుగా ఏపీలో పంచాయతీ ఎన్నికలు తయారయ్యాయి. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, ప్రభుత్వం మధ్య వివాదానికి ఏదో ఓ అంశం ఆజ్యం పోస్తూనే ఉంది. ఎన్నికల ఫిర్యాదుల కోసం ఎస్‌ఈసీ ఆవిష్కరించిన యాప్‌ దుమారం రేపుతోంది. పోటీగా వైసీపీ కూడా మరో యాప్‌ను ఆవిష్కరించింది. ఈ వాచ్‌పై యాప్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో సర్కార్‌ పిటిషన్‌ వేసింది. దీనిపై 2021, ఫిబ్రవరి 04వ తేదీ గురువారం విచారణ జరగనుంది. ఏపీ పంచాయతీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన యాప్‌… ఎస్‌ఈసీ, అధికార వైసీపీ మధ్య చిచ్చుపెట్టింది.

ఇప్పటికే ఏపీలో మితిమీరిన పంచ్‌లతో ఒకరిపై మరొకరు ఆరోపణాస్త్రాలు సంధించుకుంటున్నారు. విమర్శలు, ప్రతివిమర్శలతో గ్రామ పంచాయతీ ఎన్నికలు… ఏకంగా అసెంబ్లీ ఎలక్షన్స్‌ను తలపిస్తున్నాయి. ఎన్నికల కోసం ఎస్ఈసీ.. ఈ-వాచ్‌ యాప్‌ ఆవిష్కరణతో మరో లొల్లి మొదలైంది. పోలింగ్‌ అక్రమాలను అరికట్టేందుకే వాచ్‌ యాప్‌ను తీసుకొచ్చామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ చెబుతున్నారు. ఎలాంటి సందేహాలు, ప్రశ్నలకు తావులేకుండా యాప్‌ను రూపొందించినట్లు చెప్పారు. సమావేశాలతో కాలం గడపకుండా పనికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.

ఎన్నికల కోసం ఎస్‌ఈసీ తీసుకొచ్చిన ఈ-వాచ్‌ యాప్‌కు పోటీగా వైసీపీ ఈ- నేత్రం యాప్‌ను వినియోగిస్తోంది. ఈ యాప్ ద్వారా ఫోటోలు, ఆడియో, వీడియోలను వైసీపీ కార్యాలయానికి పంపించేలా యాప్ రూపొందించారు. వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు పార్టీ నేతలు. ప్రజలు పూర్తి స్థాయిలో యాప్‌ను వినియోగించుకోవాలని వైసీపీ పిలుపునిచ్చింది. అయితే ఎస్ఈసీ తీసుకొచ్చిన ఈ-వాచ్‌ యాప్‌ టీడీపీ కార్యాలయంలోనే తయారైందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ఎలక్షన్ కమిషన్ యాప్‌లపై పెట్టే శ్రద్ధ ఫిర్యాదులపై పెట్టాలన్నారు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.
మొత్తంమ్మీద మొదటి నుంచి వివాదాస్పదంగా మారుతున్న ఏపీ పంచాయతీ ఎన్నికల్లో కొత్తగా యాప్‌ లొల్లి ముదిరింది. మరి ఈ పరిణామాలు ఎంత దూరం వెళతాయో చూడాలి.