కాసేపట్లో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రెస్ మీట్, తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు పరిష్కారమయ్యేనా

ap, telangana river water sharing disputes: కాసేపట్లో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మీడియా ముందుకు రానున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్రం తీసుకున్న చర్యలను వివరించనున్నారు. రెండు గంటల పాటు సాగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో రెండు తెలుగు రాష్ట్రాలు గట్టిగా తమ తమ వాదనలు వినిపించినట్లు తెలుస్తోంది.
జల వివాదాలపై తమ తమ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లుగా సమాచారం. గోదావరిపై తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. ఇక కృష్ణా నదిపై ఏపీ చేపడుతున్న విస్తరణ ప్రాజెక్టులు ఆపాలని తెలంగాణ వాదనలు వినిపించినట్లుగా తెలుస్తోంది. అపెక్స్ కౌన్సిల్ భేటీలో రెండు రాష్ట్రాలు చేపడుతున్న కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను కేంద్రమంత్రికి సమర్పించారు సీఎంలు.
తెలంగాణ నీటి హక్కులు కాపాడాలని బీజేపీ డిమాండ్:
అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నీటి హక్కులు కాపాడాలని తెలంగాణ బీజేపీ కోరుతుంది. ఈ మేరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదుట బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను కాపాడాలని బీజేపీ నేతలు కోరారు. అలాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి, కృష్ణసాగర్‌రావు పాల్గొన్నారు.