ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా అరూప్ కుమార్ గోస్వామి

ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా అరూప్ కుమార్ గోస్వామి

Updated On : January 6, 2021 / 4:15 PM IST

Arup Kumar Goswami sworn in as the Chief Justice of the AP High Court : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా అరూప్‌ కుమార్ గోస్వామి ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఏపీ గవర్నర్ హరిచందన్‌.. కొత్త న్యాయమూర్తితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్త చీఫ్ జస్టిస్‌కు గవర్నర్‌తో పాటు… ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.

గోస్వామికి శాలువా కప్పి సీఎం జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకు సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ గోస్వామి ఏపీకి బదిలీ అయ్యారు. ఏపీ హైకోర్టు సీజేగా పనిచేసిన జేకే మహేశ్వరి.. సిక్కిం ఉన్నత న్యాయస్థానానికి బదిలీ అయ్యారు.

అంతకుముందు జస్టిస్‌ అరూప్‌ గోస్వామి బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. బుధవారం ఉదయం సతీసమేతంగా ఆలయానికి వెళ్లిన ఆయనకు దేవాలయ అధికారులు ఘనస్వాగతం పాలికారు. వేకువజామున జరిగిన పంచహారతుల సేవలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు.

1961 మార్చీ 11న అసోంలోని జోర్హాట్ లో అరూప్‌ కుమార్ గోస్వామి జన్మించారు. 19985లో గౌహతి గవర్నమెంట్ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. 1985 ఆగస్టు 16న న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. వివిధ సేవలకు సంబంధించి అనే కేసుల్లో వాదనలు వినిపించారు. 2004 డిసెంబర్ లో గౌహతి హైకోర్టులో సీనియర్ న్యాయవాది హోదా పొందారు.

2011లో గౌహతి హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా సేవలు అందించారు. 2012లో శాశ్వత న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. నాగాలాండ్ న్యాయ సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కూడా సేవలు అందించారు. 2018లో గౌహతి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలు చేశారు. 2019 అక్టోబర్ 15 నుంచి సిక్కిం చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించారు.