బద్వేల్ టీడీపీని వీడినట్టేనా? : వైసీపీలోకి విజయమ్మ?

కడప జిల్లా బద్వేలు మాజీ శాసనసభ్యురాలు ఎ విజయమ్మ టీడీపీ వీడిపోతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల అధినేత చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు విజయమ్మ హాజరు కాకపోవడంతో ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి. విజయమ్మ కుటుంబం గత 35 సంవత్సరాలుగా టీడీపీలోనే కొనసాగుతోంది. విజయమ్మ తండ్రి బిజినవేముల వీరారెడ్డి శాసనసభ్యుడిగా, మంత్రిగా పని చేసి జిల్లా రాజకీయాలను శాసించారు. టీడీపీలో క్రియాశీలక నాయకుడిగా కొనసాగారు. వీరారెడ్డి మరణాంతరం 2001లో రాజకీయ రంగప్రవేశం చేసిన విజయమ్మ ఒక దఫా ఎమ్మెల్యేగా గెలిచారు.
పదవి అడిగిన ఇవ్వలేదని :
అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో నియోజకవర్గం ఎస్సీ రిజర్వు అయ్యింది. నియోజకవర్గ ఇన్‌చార్జిగా మాత్రం విజయమ్మే కొనసాగుతూ వస్తున్నారు. ఆమె వారసునిగా రంగప్రవేశం చేసిన రితీష్ కుమార్ రెడ్డి.. నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తెను వివాహం చేసుకున్నారు. 2009లో నియోజకవర్గం రిజర్వ్‌డ్ అయినప్పటి నుంచి పార్టీ పట్టు కోల్పోకుండా విజయమ్మ కుటుంబం కృషి చేస్తూనే ఉంది. అయితే, 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయమ్మకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ఆశించారు.
ఎమ్మెల్సీ పదవి కేటాయించాల్సిందిగా చాలా సార్లు విజయమ్మ పార్టీ అధిష్టానాన్ని కోరారు కూడా. అయినా పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ స్థానం ఆమెకు కేటాయించలేదు. ఈ విషయంలో ఆమె అప్పట్లోనే అసంతృప్తికి గురైనట్లుసమాచారం. పార్టీలో ఏ పదవి లేకపోయినా పదేళ్ల కాంగ్రెస్ పాలనలో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశామని, అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం చంద్రబాబు తనకు పదవి ఇవ్వకపోవడంతో ఆమెతో పాటు అనుచర వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైందంటారు.
అదే జరిగితే.. టీడీపీ ఖతమే :
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఏర్పడ్డ వర్గ కలహాల కారణంగా తమ వాదనలు వినిపించేందుకు అనుచరవర్గంతో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్లారు విజయమ్మ. అయితే, చంద్రబాబు ఆమెతో మాట్లాడేందుకు విముఖత చూపడంతో అప్పట్లోనే విజయమ్మ వర్గం అసంతృప్తికి లోనైందంటున్నారు. ఈ విషయాలన్నింటినీ గమనిస్తూ వచ్చిన వైసీపీ నియోజకవర్గ, జిల్లా నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. వైసీపీ అధిష్టానం విజయమ్మ వియ్యంకుడు, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ద్వారా ఆమెను వైసీపీలోకి తెచ్చేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇదే గనుక జరిగితే నియోజకవర్గంలో టీడీపీ పని అయిపోయినట్టే అని అంటున్నారు.
బాబు నచ్చచెప్పినా :
తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోకుండా వర్గాన్ని, కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తున్న విజయమ్మ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి వెళ్లారా అన్న ప్రశ్న నియోజకవర్గ ప్రజలను సతమతం చేస్తోందట. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మధ్య హైదరాబాద్‌లో విజయమ్మ నివాసానికి వెళ్లి ఆమెతో, కుటుంబ సభ్యులతో మంతనాలు జరిపి నచ్చజెప్పారని చెబుతున్నారు. మరి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందేనని జనాలు అనుకుంటున్నారు. వైసీపీలోకి వెళ్లడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.