Bhogi Festival: తెలుగు లోగిళ్లలో వైభవంగా భోగి పండుగ.. భోగి మంటలతో మొదలైన సంక్రాంతి సంబరాలు
Bhogi Festival: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి పండగ వేడుకలు జరుగుతున్నాయి. తెల్లవారుజామునే భోగి మంటలు వేసి పిల్లలు, పెద్దలు పాడుతూ, డ్యాన్స్ లు చేస్తూ సందడి చేశారు.

Bhogi Festival
Bhogi Mantalu: తెలుగు వారికి పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. మూడు రోజులు సంప్రదాయబద్దంగా సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. తొలి రోజు భోగి పండుగతో ఈ పండగ ప్రారంభమవుతుంది. దీంతో సోమవారం తెల్లవారు జామున భోగి మంటలతో పండుగ సంబరాలు మొదలయ్యాయి. వేకువజామునే పిల్లలు, పెద్దలు, మహిళలు వీధుల్లో, ఇళ్ల ముందు భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ తిరుగూత పాడుతూ, డ్యాన్సులు వేశారు. దీంతో రెండు రాష్ట్రాల్లోని వాడవాడలా భోగి మంటలతో సందడి వాతావరణం నెలకొంది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని పద్మావతి అమ్మవారి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద భోగి వేడుకలను నిర్వహించారు. భీమవరం వెంపలో జరిగిన భోగి వేడుకల్లో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. కేంద్ర మంత్రితోపాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఇక్కడి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. భోగి మంటలు వేసి సందడి చేశారు. నెల్లూరు జిల్లాలో భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. నగరంలోని శివాలయం వద్ద నిర్వహించిన భోగి వేడుకల్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. భోగి మంటలు వెలిగించి రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
సినీనటుడు మోహన్ బాబు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ ఆవరణలో భోగి మంటలు వెలిగించి మోహన్ బాబు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు మంచు విష్ణు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
విశాఖపట్టణంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో చిన్నారులు, పెద్దలు, మహిళలు అంతా ఒకదగ్గరకు చేరి భోగి మంటలు వేసి వాటి చుట్టూ తిరుగుతూ భోగి వేడుకల్లో పాల్గొన్నారు.
నగరిలో మాజీ మంత్రి రోజా ఇంటి వద్ద భోగి పండుగ సంబరాలు జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేశారు. అనంతరం భోగి మంటల చుట్టూ రోజా, ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు పాడుతూ, డ్యాన్స్ లు చేస్తూ సందడి చేశారు.
హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, ఒగ్గుడోలు కళాబృందంతో కేబీఆర్ పార్క్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.
హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో భోగి మంటలు వేసి పిల్లలు, పెద్దలు సందడి చేశారు. హైదరాబాద్ లోని పలు చోట్ల రాత్రి నుండే గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రజలు భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భోగి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలోని పొంగులేటి క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన భోగి వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. భోగి మంటలు వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.