వైసీపీకి షాక్ మీద షాక్..! పార్టీ వీడేందుకు క్యూ కడుతున్న నేతలు..!
ఎంపీ పదవులకు రాజీనామా చేయడంతో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా వారిద్దరూ రాజీనామా చేయనున్నారని సమాచారం.

Big Shock For Ysrcp : అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఆ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీని వీడేందుకు నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు వైసీపీకి రాజీమా చేశారు. మరికొందరు అదే బాటలో ఉన్నారు.
తాజాగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది. రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు రేపు రాజీనామా చేయనున్నారని సమాచారం. ఢిల్లీలో రాజ్యసభ ఛైర్మన్ ని కలిసి వారు తమ రాజీనామా పత్రాలు ఇవ్వనున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే మోపిదేవి, బీదా మస్తాన్ రావులు ఢిల్లీకి పయనం అయ్యారు. ఎంపీ పదవులకు రాజీనామా చేయడంతో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా వారిద్దరూ రాజీనామా చేయనున్నారని సమాచారం. త్వరలో వారిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది. మోపిదేవి, బీదా మస్తాన్ రావు బాటలోనే మరికొందరు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీలో ఎదురైన అవమానాలు, జగన్ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయి పార్టీని వీడుతున్నామని నేతలు అంటున్నారు.
Also Read : అందుకే ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డికి క్షమాపణ చెప్పా.. తాడిపత్రి సీఐ క్లారిటీ
వైసీపీకి ఎమ్మెల్సీ రాజీనామా..
వైసీపీలో రాజీనామాల పర్వం కంటిన్యూ అవుతోంది. రాజీనామా చేసేందుకు నేతలు క్యూ కట్టారు. ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రిజైన్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కాగా, పోతుల సునీత టీడీపీలో లేదా బీజేపీపీలో చేరే అవకాశం ఉంది. ఓవైపు టీడీపీ, మరోవైపు బీజేపీ నేతలతో పోతుల సునీత చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. తాడేపల్లి నుండి చీరాలకు వెళ్లాక తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని పోతుల సునీత తెలిపారు. విప్లవ భావజాలం నుండి ప్రజాజీవన స్రవంతిలో కలిసిన తర్వాత టీడీపీలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రాంరంభించారు పోతుల సునీత.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సార్వత్రిక ఎన్నికలు ముగిసి రెండు నెలల తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పలువురు నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. రాజ్యసభలో ఏపీ కోటా మొత్తం కూడా వైసీపీ సభ్యులు మాత్రమే ఉన్నారు. వీరిలో చాలామంది ఎంపీలు టీడీపీ, బీజేపీవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మోపిదేవి వెంకటరమణ వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. వైఎస్ జగన్ కు అత్యంత ఆత్మీయుడిగా గుర్తింపు పొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైఎస్ కుటుంబం కోసం జైలుకెళ్లిన చరిత్ర కూడా ఉంది. అలాంటి నేత వైసీపీని వీడాలని నిర్ణయించుకోవడం పార్టీ వర్గాల్లో సంచలనంగా మారింది. రాజ్యసభ్య ఛైర్మన్ ను కలిసి తన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేయబోతున్నారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను ఎందుకు వైసీపీని వీడాల్సి వచ్చింది? కారణాలు ఏంటి? పార్టీలో జరిగిన పరిణామాలు ఏంటి? వీటన్నింటిని ఆయన తెలియజేయనున్నారు.
బలహీన వర్గాలకు చెందిన మరో నేత బీద మస్తాన్ రావు సైతం వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది. గతంలో టీడీపీలో ఉన్నారు. 2019 ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. బీద మస్తాన్ రావు సైతం తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. బీద మస్తాన్ రావు సోదరుడు బీద రవిచంద్ర ప్రస్తుతం టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మోపిదేవి, మస్తాన్ రావు.. ఇద్దరూ ఢిల్లీ వెళ్లి రాజ్యసభ ఛైర్మన్ కు రాజీనామా లేఖలు అందజేయబోతున్నారు.
మోపిదేవి రాజీనామా చేశాక ఇక పూర్తిగా ఆయన రాజ్యసభకు దూరంగా ఉండబోతున్నారని సమాచారం. బీద మస్తాన్ రావు మాత్రం.. ఉప ఎన్నిక వస్తే టీడీపీ నుంచి ఎన్నిక కావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోది. ఇప్పటికే మోపిదేవి… టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి తన భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి మోపిదేవికి కేటాయించే అవకాశం ఉంది.