Ysrcp MLCs: వైసీపీకి బిగ్ షాక్..! టీడీపీలో చేరనున్న ఆ ముగ్గురు ఎమ్మెల్సీలు..

టీడీపీలో చేరబోతున్న ఆ ముగ్గురు ఎమ్మెల్సీలు ఎవరెవరు? ఎందుకు వైసీపీని వీడుతున్నారు? కారణం ఏంటి?

Ysrcp MLCs: వైసీపీకి బిగ్ షాక్..! టీడీపీలో చేరనున్న ఆ ముగ్గురు ఎమ్మెల్సీలు..

Updated On : September 19, 2025 / 5:15 PM IST

Ysrcp MLCs: వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరనున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ టీడీపీ కండువా కప్పుకోనున్నారు. వారు ఇప్పటికే వైసీపీకి, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.

చంద్రబాబు నివాసంలో ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీ గూటికి చేరనున్నారు. వీరు ఇప్పటికే రాజీనామాలు సమర్పించారు. కానీ, మండలి ఛైర్మన్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీనికి సంబంధించి వారు న్యాయస్థానాలకు వెళ్లిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆరుగురు రాజీనామా చేసి ఉన్నారు. వీరిలో పోతుల సునీత బీజేపీలో చేరారు. జయమంగళ వెంకటరమణ కొంత జనసేనకి అనుకూలంగా ఉన్న పరిస్థితి ఉంది. వీరి రాజీనామాలు పెండింగ్ లో ఉన్నాయి.

వైసీపీలో విభేదాలతో బయటకు..

వైసీపీని విభేదించి వీరంతా బయటకు వచ్చారు. విడదల రజినీతో విభేదాల కారణంగా మర్రి రాజశేఖర్ వైసీపీని వీడి టీడీపీలో చేరబోతున్నారు. గతంలోనే ఎమ్మెల్సీ పదవికి ఆయన రిజైన్ చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని ఛైర్మన్ పైనా ఒత్తిడి తీసుకొచ్చారు. సభలో ఆందోళన కూడా చేశారు. కానీ, ఇప్పటివరకు ఛైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక జయమంగళ వెంకటరమణ న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. ఆయన పిటిషన్ పై కోర్టు సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. వెంటనే ఈ అంశాన్ని తేల్చాలని చెప్పింది.

సార్వత్రి ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత కర్రి పద్మశ్రీ వెంటనే టీడీపీకి అనుకూలంగా మారారు. తన పదవికి రాజీనామా చేశారు. సభలో ఆందోళన కూడా నిర్వహించారు. కొంత కాలానికే బల్లి కల్యాణ్ చక్రవర్తి సైతం రాజీనామా సమర్పించారు. కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్.. ఎమ్మెల్సీలుగా వీరిద్దరి కాలపరిమితి 2029 మార్చి వరకు ఉంది. బల్లి కల్యాణ్ చక్రవర్తి పదవీ కాలం 2027వరకు ఉంది.

వీరు అధికారికంగా టీడీపీలో చేరితే.. వైసీపీ వారిపై ఫిరాయింపు నిరోధక చట్టం వర్తింపజేయాలని కోరుతుందా? అనే చర్చ జరుగుతోంది. వైసీపీ ఫిర్యాదు చేస్తే ఛైర్మన్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: కడప సైకిల్ రథసారధి అయ్యేదెవరు? ఆ ఇద్దరిలో సీఎం చంద్రబాబు ఆశీస్సులు ఎవరికి?