గెలుస్తారా : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ – జనసేన పోటీ

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. విజయవాడలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించాయి. రెండు పార్టీలు పొత్తు నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత తొలి సమన్వయ కమిటీ సమావేశం 2020, జనవరి 28వ తేదీ మంగళవారం విజయవాడలో జరిగింది. రెండు పార్టీలకు సంబంధించిన సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి రాజధాని రైతుల వద్దకు వెళ్లి వారికి భరోసా కల్పించాలని సమన్వయ కమిటీ నిర్ణయించింది.
రాజధాని మార్పులపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించామనే ప్రచారాన్ని కమిటీ ఖండించింది. తప్పుడు ప్రచారం చేయడంలో అధికార, విపక్షాలు ఒకే వైఖరి అవలంబిస్తున్నాయని కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అమరావతిలో ప్రస్తుత పరిస్థితికి వైసీపీ, టీడీపీలే కారణమని సమన్వయ కమిటీ అభిప్రాయపడింది. క్షేత్ర స్థాయిలో కమిటీలు నియమించాలని నిర్ణయించింది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఇలాంటి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మండలి రద్దుకు సంబంధించి కూడా సమన్వయ కమిటీ ప్రధానంగా చర్చించింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులకు సంబంధించి ఒక నివేదికను రూపొందించి… తొందర్లోనే పార్టీ అధిష్ఠానానికి నివేదిస్తామని ఇరు పార్టీల నేతలు వెల్లడించినట్లు తెలుస్తోంది.
Read More : మండలి రద్దు : పార్లమెంట్‌లో పోరాడండి..ఎంపీలకు బాబు సూచన