వారిపై చర్యలు తీసుకుంటే ఎన్నికలు నిర్వహించేదెవరు?: పురేంధేశ్వరికి మంత్రి బొత్స ప్రశ్న

ఐఏఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేసిన బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురేంధేశ్వరిపై మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.

వారిపై చర్యలు తీసుకుంటే ఎన్నికలు నిర్వహించేదెవరు?: పురేంధేశ్వరికి మంత్రి బొత్స ప్రశ్న

Botsa Satyanarayana: ప్రభుత్వ అధికారులను కాదని హెరిటేజ్ ఫుడ్స్ సిబ్బందితో ఎన్నికలు నిర్వహించాలా అని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురేంధేశ్వరిని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విజయనగరంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”30 మంది ఐఏఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కి పురంధేశ్వరి ఫిర్యాదు చేశారు. వారిని సీఎం జగన్ నియమించారా? గతంలో వారు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య ప్రభుత్వ హయాంలో పనిచేయలేదా? వారందరిపై చర్యలు తీసుకుంటే ఎన్నికలు నిర్వహించేది ఎవరు? వారిని కాదని హెరిటేజ్ ఫుడ్స్ సిబ్బందితో ఎన్నికలు నిర్వహించాలా?” అని అన్నారు.

సీఎం జగన్ ప్రభుత్వం అవసరం, ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉందని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ”సీఎం జగన్ పెట్టిన వ్యవస్థలు దేశంలో ఎక్కడా లేవు. జగన్ అమలు చేసిన సంస్కరణల వలన రాష్ట్రంలో పేదరికం తగ్గింది. విద్యలో కూడా కేరళను అధిగమించాం. సీఎం జగన్ చెప్పిందే చేశారు, చేయలేనివి చెప్పరు. ఆర్ధిక కారణాల వలన ఉద్యోగులకు సీపీఎస్ అమలు చేయలేకపోయాం. సీపీఎస్ కన్నా మెరుగైన పథకం పెట్టాం.

14 ఏళ్ల చరిత్రలో చంద్రబాబు చెప్పింది చేశామని చెప్పగలరా? జగన్ నాయకత్వం చేస్తున్నది నాయకులతో కాదు.. ప్రజలతో. మానసికంగా ఆందోళనకు గురిచేసేందుకే మాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. కానీ, అవి పట్టించుకునే పరిస్థితిలో మేము లేమ”ని బొత్స సత్యనారాయణ అన్నారు.

Also Read: పవన్ కల్యాణ్‌ను ఎందుకు సపోర్టు చేయాలి?: ముద్రగడ పద్మనాభం